మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

23 Jul, 2015 23:08 IST|Sakshi

నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ మున్సిపాలిటీలో జరిగిన ఆస్తిపన్ను కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. మున్సిపాలిటీలో 2011 నుంచి 2015 మధ్య వసూలుచేసిన ఆస్తిపన్ను డబ్బులు మున్సిపల్ కార్యాలయంలో జమ చేయకుండా స్వాహ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు తెలిసింది. 2011 నుంచి 2015 మార్చి నెలాఖరు వరకు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అన్ని రకాల రికార్డులు, పన్ను వసూలు, ఖర్చు, రశీదు బక్కులు, చెక్కు బుక్కులు తదితర వాటిపై స్పెషల్ ఆడిట్ బృందం చేస్తున్న విచారణ ముగింపు దశకు చేరింది.
 
 ఇటీవల ఏజీ ఆడిట్ అధికారుల బృందం కూడా వారం రోజులు విచారణ జరిపి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఒక్క రెవెన్యూ విభాగంలోనే ఆస్థి పన్నుకు సంబంధించిన విషయంలో 3.32 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు వెలుగుచూసింది. దీంతో 2011 సంవత్సరం నుంచి ఎంతమంది ఉద్యోగులకు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందన్న దానిపై పూర్తి విచారణ జరిపినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఒక యూడీఆర్‌ఐకి, 17మంది బిల్ కలెక్టర్లకు అక్రమాలలో పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై కొరఢా ఝులిపించి వేటు వేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
 
 ఇప్పటికే సస్పెండ్ అయిన ఇద్దరు ఉద్యోగులు..
 మున్సిపాలిటీ కార్యాలయంలో ఆస్తిపన్ను కాజేసిన వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులను రెండు నెలల క్రితమే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అకౌంట్ విభాగంలో ఉన్న రశీదు బుక్కులు దొంగతనానికి గురయ్యాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో దొంగతనం జరగడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించింది. ఇదే విషయంలో ఇప్పటికే ఐదుగురి ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతుంది. ఇంకా చోరీకి గురైన ఆస్తిపన్నుకు సంబంధించిన రశీదు బుక్కులు దొరకాల్సి ఉంది. ఆ బుక్కులు దొరికితే అవినీతి మరికొంత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు