కలెక్టర్ బదిలీ

30 Dec, 2014 23:13 IST|Sakshi
కలెక్టర్ బదిలీ

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉత్కంఠకు తెర వీడింది. జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌గా ఇంకా ఎవరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. కొత్తవారిని నియమించేవరకు శ్రీధ ర్ పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్‌కు కూడా ఆయనే ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీధర్ గత జూన్ 17న కలెక్టర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుఅభిమానాన్ని చూరగొన్న శ్రీధర్.. ప్రతిష్టాత్మక సింగరేణి చైర్మన్ గిరిని దక్కించుకోగలిగారు. శ్రీధర్ పేరుకు కేంద్రం కూడా ఆమోదముద్ర వేయడంతో ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సీఎండీగా నియమిస్తూ బదిలీ చేసింది. కాగా, కొత్త కలెక్టర్ ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కీలక జిల్లాగా పరిగణించే ఈ పోస్టుకు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర పోటీ నెలకొంది.

ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల విభజన ప్రక్రియకు బుధవారం పుల్‌స్టాప్ పడనున్న నేపథ్యంలో జరిగే బదిలీల్లో రంగారెడ్డి జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ పదవికి ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రఘునందన్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సామాజిక సమీకరణలు, సీఎం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేడర్‌కు ఖరారు కావడంతో బుధవారం ఆయన ఏపీ రాష్ట్రం నుంచి రిలీవ్ కానున్నారు.
 
కలెక్టర్ శ్రీధర్ నిర్వహించిన పదవులు
కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో 1971 జూన్ 1న జన్మించిన శ్రీధర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్(ఈసీఈ) పూర్తి చేశారు. 1997లో ఐఏఎస్ ఎంపికైన ఆయన తొలుత రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా.. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అక్కడి నుంచి నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, పోర్టుల డెరైక్టర్‌గా కాకినాడలో విధులు నిర్వర్తించారు.

అనంతరం అనంత పురం, కృష్ణా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా సీఎంవోలో ముఖ్య భూమిక పోషించారు. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆయన సుమారు ఆరు నెలలపాటు జిల్లాలో సేవలందించారు. కాగా, నాలుగు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసిన అధికారిగానే కాకుండా... సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపడుతున్న యువ ఐఏఎస్‌గా శ్రీధర్ గుర్తింపు పొందనున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు