బార్ పాలసీ ఉత్తర్వుల్లో జాప్యం

8 Oct, 2016 03:53 IST|Sakshi
బార్ పాలసీ ఉత్తర్వుల్లో జాప్యం

సీఎం సంతకమైనా ప్రకటించని సర్కార్
సాక్షి, హైదరాబాద్: బార్ పాలసీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను వెల్లడించడంలో జాప్యం జరుగుతోంది. సెప్టెంబర్ 30తో ముగిసిన 2015-16 బార్ పాలసీ స్థానంలో ఈ నెల 1 నుంచి నూతన పాలసీ అమలులోకి వచ్చింది. పలు సవరణలు చేస్తూ రూపొందించిన ఈ బార్ పాలసీని ఆమోదిస్తూ ఈ నెల ఒకటో తేదీనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 214 రూపొందించారు. కానీ ఐదు రోజులైనా ఈ జీవోను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టలేదు. ఎక్సైజ్ మంత్రి పద్మారావు, ప్రభుత్వ కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రవదన్‌కు మాత్రమే ఈ ఉత్తర్వులు అందాయి.

బార్ లెసైన్సు ఫీజు రూ. 5 లక్షలు పెంపు, బార్ విస్తీర్ణం ఆధారంగా లెసైన్సు ఫీజును 10 శాతం నుంచి 30 శాతం వరకు పెంచుతూ ఆబ్కారీ శాఖ చేసిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలపడంతో తదనుగుణ ంగా ఫీజుల వసూళ్లను ప్రారంభించారు. అదే సమయంలో పాలసీలో కొత్తగా చేసిన సవరణలు ఈ జీవోలో ఉన్నప్పటికీ, వాటి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.

మరోవైపు జీవోలో బార్ లెసైన్సుల మంజూరీకి నిర్ణయించిన జనాభా లెక్కల్లో మార్పులు చేసినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13 వేల జనాభాకు ఒక బార్ చొప్పున అనుమతికి అవకాశం ఉండగా, దానిని 11 వేలకు తగ్గించినట్లు సమాచారం. అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో 30 వేల జనాభాలోపు ఉంటే ఇప్పటి వరకు బార్ లెసైన్సు ఇచ్చేవారు. దానిని కూడా 25 వేలకు తగ్గించినట్లు తెలిసింది. వీటికి తోడు మరిన్ని సవరణలు కూడా చేసినట్లు అధికారులు చెపుతున్నారు. కాగా జీవోను అధికారికంగా వెల్లడించడానికి ముందు న్యాయ సలహా కోసం పంపించి నట్లు అధికారులు చెపుతున్నారు.

>
మరిన్ని వార్తలు