కల్తీకి కొత్త చట్టంతో చెక్‌!

17 Sep, 2019 02:07 IST|Sakshi

ఇకపై జరిమానాలు పదింతలు: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆహార కల్తీ నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. ఇప్పటికే అమలులో ఉన్న కేంద్ర చట్టానికి అనుబంధంగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలను పదింతలు చేస్తామన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆహారభద్రత పర్యవేక్షణపై మజ్లిస్‌ సభ్యులు ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్, జాఫర్‌హుస్సేన్‌ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి..ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆహారనాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని, త్వరలోనే 26 ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వారు ఒక్కొక్కరు నెలకు 150 నమూనాలను సేకరించి పరిశీలిస్తున్నారని, ఈ భారాన్ని తగ్గించేందుకు ఇటీవల సంచార ఆహార ప్రయోగశాలను ఏర్పాటు చేశామన్నారు.

మార్చినాటికీ టీ హబ్‌–2 
రాయదుర్గంలో రూ.276 కోట్లతో మూడెకరాల్లో నిర్మిస్తున్న టీ హబ్‌–2 వచ్చే ఏడాది మార్చినాటికి అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యేలు వివేకానంద్, బాల్క సుమన్, బిగాల గణేశ్‌ అడిగిన ప్రశ్న కు కేటీఆర్‌ తెలిపారు. ఇది దేశంలోనే విజయవంతమైన ఇంక్యుబేటర్‌ కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహబ్‌–2 నిలుస్తుందన్నారు. 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఈ ఇంక్యుబేటర్‌ రాకతో వేయి అంకుర ప రిశ్రమలకు అవకాశం కలుగుతుందన్నారు. గోవా, ఢిల్లీ, అసోం రాష్ట్రాలకు సాంకేతిక సహకారం అం దిస్తున్నామన్నారు. టీహబ్‌కు ఆర్‌బీఐ, నీతి ఆయోగ్‌లాంటి సంస్థల నుంచి ప్రశంసలందాయని, ఐటీ దిగ్గజ కంపెనీల అధినేతల అభినందనలు అందు కున్నామన్నారు. టీహబ్‌–2తో 4 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

ఐదేళ్లలో మైనింగ్‌ ఆదాయం 130% 
గనుల ద్వారా 2008–2014 వరకు రూ.7,376 కో ట్ల ఆదాయం రాగా.. అప్పటి నుంచి గత నెలనాటికి రూ.16,937 కోట్ల రాబడి లభించిందని కేటీఆర్‌ తెలిపారు. ఇది గతంతో పోలిస్తే 130% అధి కమన్నారు. కొత్త ఇసుక తవ్వక విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఆదాయం పెరిగిందని చెప్పారు. గత పాలకుల హయాంలో ఈ ఆదాయం ఎక్కడకు పోయిందో కాంగ్రెస్‌ సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ములుగులో గిరిజనుల పేరిట గిరిజనేతరులు కాంట్రాక్టులు దక్కించుకునేవారని, దానికి ముకుతాడు వేసి గిరిజన సహకార సంఘాలకు ఇసుక కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా 11.30 వేల కుటుంబాలకు రూ.83 కోట్ల ప్రయోజనం కలి గిందని కేటీఆర్‌ అన్నారు. డీఎంఎఫ్‌ నిధులను ఆ యా ప్రాంతాల్లోనే ఖర్చుపెట్టేలా విధానపర నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.  

ఇద్దరికి కూడా విద్యానిధి 
ఓవర్‌సీస్‌ విద్యానిధి కింద కుటుంబంలో ఒకరికే స్కాలర్‌షిప్‌ మంజూరు చేస్తున్నప్పటికీ, దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి కూడా ఆర్థిక సాయం చేయనున్నట్లు బాల్కసుమన్, హరిప్రియానాయక్, శంకర్‌నాయక్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి కొప్పుల జవాబిచ్చారు. ఎంబీబీఎస్‌ విద్యార్థులు కూడా విదేశా ల్లో ఈ స్కాలర్‌షిప్‌ కింద చదువుకునేందుకు వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.  

తాటిచెట్లు ఎక్కేందుకు యంత్రాల పరిశీలన 
తాటిచెట్లు ఎక్కడానికి ట్రీ క్లైంబింగ్‌ మెషీన్లు అనువు కాదని పరిశీలనలో తేలిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. అనువైనవి అందుబాటులో ఉంటే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. గుడుంబా నిర్మూలన, దాని తయారీదారులకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా