రైతు ప్రయోజనమే లక్ష్యంగా..

2 May, 2017 02:57 IST|Sakshi
రైతు ప్రయోజనమే లక్ష్యంగా..

మార్కెట్‌లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు
త్వరలో యార్డులో అత్యాధునిక నాణ్యత పరీక్షా ల్యాబ్‌
సమష్టి కృషితోనే ఈ–నామ్‌కు జాతీయ అవార్డు


సాక్షి, నిజామాబాద్‌ :ఆరుగాలం శ్రమించి పండించిన పంట క్రయవిక్రయాల్లో  రైతుల   ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌   యోగితారాణా అన్నారు. రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లను జాతీయస్థాయిలో విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషితోనే నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డుకు   ఈ–నామ్‌ అమలులో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని ఆమె పేర్కొన్నారు. ఈ అవార్డు తనపై బాధ్యతను పెంచిందని అన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ డే పురస్కరించుకుని ప్రధానమంత్రి విశిష్టసేవ అవార్డును నరేంద్రమోడీ చేతులు మీదుగా అందుకున్న అనంతరం కలెక్టర్‌ యోగితారాణా సోమవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో మాట్లాడారు.

సాక్షి : జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నందుకు ఎలా ఫీలవుతున్నారు?
కలెక్టర్‌ : జాతీయ స్థాయి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో జిల్లా అధికార యంత్రాంగం కృషి ఉంది. ఈ అవార్డు రావడానికి మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డైరెక్టర్‌ లక్ష్మిబాయిలు ఎంతో ప్రోత్సహించారు.

సాక్షి : అవార్డు రావడానికి మీరు ప్రత్యేకంగా చేపట్టిన చర్యలేంటీ?
కలెక్టర్‌ : ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాం. ఈ–నామ్‌ విధానంపై వివిధ స్థాయిల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. ఈ విధానంతో ఉండే ప్రయోజనాలను సహకార సంఘాల ద్వారా రైతులకు వివరించాం. ఇటు వ్యాపారులను కూడా ఆ దిశగా ప్రోత్సహించాం.

సాక్షి : జిల్లాలోని పసుపు రైతులు ఇక్కడ సరైన ధర రావడం లేదని మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్తున్నారు కదా?
కలెక్టర్‌ : వాస్తవమే.. సాంగ్లీకి వెళ్లే రైతుల సంఖ్య సుమారు 20 శాతం వరకు తగ్గిందని భావిస్తున్నా. సాంగ్లీలో ఉన్న ధర ప్రకారం ఇక్కడే కొనుగోలు చేసేలా అక్కడి వ్యాపారులతో కూడా మాట్లాడుతాం.

సాక్షి : డీపీసీ విధానం ద్వారా కమీషన్‌ ఏజెంట్లకు చెక్‌ పడిందని భావిస్తున్నారా?
కలెక్టర్‌ : యార్డులో ప్రత్యేకంగా డైరెక్ట్‌ పర్చేస్‌ సెంటర్‌(డీపీసీ)ని ఏర్పాటు చేశాం. ఈ కేంద్రంలో రైతులు తమ ఉత్పత్తులను విక్రయిస్తే కమీషన్‌ ఏజెంట్లకు రెండు శాతం కమీషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఖరీదుదారులకు విక్రయించేలా చర్యలు చేపట్టాం. ఈ అంశంపై యార్డుకు వచ్చే రైతులకు అవగాహన కల్పించాం. చాలా వరకు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది.

సాక్షి : ఇప్పటికీ కొందరు ఖరీదుదారులు సిండికేట్‌గా మారి ధర దోపిడీకి పాల్పడుతున్నారు కదా?
కలెక్టర్‌ : ప్రస్తుతానికి స్థానిక వ్యాపారులు మాత్రమే ఈ–బిడ్డింగ్‌లో ధర కోట్‌ చేస్తున్నారు. దీంతో సిండికేట్‌గా అయ్యేందుకు అవకాశం ఉంది కావచ్చు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఖరీదుదారులు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో పాల్గొంటే ఈ సిండికేట్‌ వ్యవహారానికి పూర్తిగా చెక్‌ పడుతుంది.

సాక్షి : ఆమ్‌చూర్‌ కొనుగోళ్లలో కమీషన్‌ ఏజెంట్లు క్యాష్‌ కటింగ్‌ పేరిట పది శాతం వరకు రైతులను దోపిడీ చేస్తున్నారు. కొందరు మార్కెట్‌ సిబ్బంది కొందరు ఏజెంట్లతో కుమ్మక్కయ్యారనే విమర్శలున్నాయి?
కలెక్టర్‌ :  వివిధ జిల్లాల నుంచి రైతులు ఆమ్‌చూర్‌ను విక్రయించేందుకు ఇక్కడికి వస్తున్నారు. కమీషన్‌ ఏజెం ట్లు రెండు శాతానికి మించి కమీషన్‌ వసూలు చేయరాదు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్య లు తీసుకుంటాం. మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే విచారణ చేసి చర్యలు చేపడుతాం.

సాక్షి : యార్డులో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు?
కలెక్టర్‌ : క్రయవిక్రయాల ప్రక్రియను పూర్తిగా కంప్యూటరైజ్డ్‌ చేశాము. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించడంతో కమీషన్, హమాలీ, చాటా వంటి చార్జీల పేరుతో ఇష్టారాజ్యంగా రైతుల చెల్లింపుల్లో కోత వి«ధించడానికి చెక్‌ పడింది. రైతుల ఉత్పత్తులకు ఈ–లాట్, ఈ–బిడ్డింగ్‌ వంటి ఏర్పాట్లు చేయడంతో ధర నిర్ణయంలో పారదర్శక పెరిగింది. ఆయా ఉత్పత్తులకు వచ్చిన ధర సంబంధిత రైతులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చేలా ఏర్పాట్లు చేశాం.

సాక్షి : రానున్న రోజుల్లో ఈ విధానం పకడ్బందీగా అమలయ్యేందుకు తీసుకోబోయే చర్యలు?
కలెక్టర్‌ : యార్డులో అత్యాధునికమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ ల్యాబ్‌ రైతుల ఉత్పత్తుల నాణ్యతను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచుతుంది. తద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలుదారులు ఈ సరుకుల నాణ్యతను పరిశీలించి ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ చేసేలా ఏర్పాటు చేస్తాం. కోల్డ్‌ స్టోరేజ్‌ను నిర్మించి ధర రాని పక్షంలో రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్‌ యార్డుకు ప్రస్తుతం వస్తున్న పంటలే గాక ఇతర పంటల క్రయవిక్రయాల వేదికగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం.

మరిన్ని వార్తలు