జీరో ఎఫ్‌ఐఆర్‌!

25 Apr, 2020 12:22 IST|Sakshi

సిటీ సైబర్‌ ఠాణాలో గురువారం నమోదు కాని కేసులు

గడిచిన నాలుగేళ్లలో ఇదే మొదటిసారి

శుక్రవారం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ మొదలైన నెల రోజుల తర్వాత దాని ప్రభావం నగర సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కనిపించింది. ఈ ఠాణాలో గురువారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత నాలుగేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం మాత్రం మూడు కేసులు రిజిస్టర్‌ చేశారు. దేశంలోనే కాదు ప్రపంచంలో గణనీయంగా పెరుగుతున్న నేరాల్లో సైబర్‌ క్రైమ్‌ ప్రథమ స్థానంలో ఉంటోంది. కనిపించని ఈ–నేరగాళ్లు ఏటా రూ. వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ ప్రభావం నగరంలోనూ కనిపిస్తోంది. గత ఏడాది 1400కు పైగా కేసులు నమోదు కాగా.. రూ.25 కోట్లకుపైగా సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఈ లెక్కన చూసుకుంటే సరాసరిన రోజుకు మూడు కంటే ఎక్కువ కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి దద22 వరకు 612 కేసులు నమోదయ్యాయి. లాక్‌ డౌన్‌ ప్రారంభమైన  తొలి రోజు (మార్చ్‌ 23న) సైతం ఈ ఠాణా అధికారులు ఏడు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియా కేసులతో బిజీ అయిపోయారు. లాక్‌డౌన్, కరోనా వైరస్‌లకు సంబంధించి అనేక పుకార్లు వీడియో, ఆడియోల రూపంలో షికార్లు చేశాయి.(రంజాన్‌ ప్రార్థనల్లో బుడ్డోడు.. నెటిజన్లు ఫిదా)

వీటిపై బాధితుల ఫిర్యాదుల ఆధారంగా, సుమోటోగానూ కేసులు నమోదు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసుల్లో అరెస్టులు, నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. వీటికి తోడు సైబర్‌ నేరగాళ్లకు టార్గెట్‌గా మారిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గడిచిన నెల రోజుల్లో 146 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ లెక్కన చూస్తే లాక్‌డౌన్‌ సమయంలోనూ సగటున రోజుకు నాలుగుకు పైగా సైబర్‌ నేరాలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను సైబర్‌ క్రైమ్‌ ఠాణా అధికారులు రిజిస్టర్‌ చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గురువారం కనీసం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు ప్రతి రోజూ 30 నుంచి 40 ఫిర్యాదులు వస్తుంటాయి. వీటిని పరిశీలించి కేసు నమోదుకు ఆస్కారం ఉన్నవి గుర్తించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం. సెలవు దినాలకు తర్వాతి రోజు, సోమవారాల్లో ఫిర్యాదులు, కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గురువారం కేవలం 14 మంది మాత్రమే సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వీటికి కేసు నమోదు ప్రమాణాలు లేకపోవడంతో ఒక్క కేసూ నమోదు చేయలేదు. 2016 నుంచి పరిశీలిస్తే సెలవు దినాలు మినహా పని రోజుల్లో (లాక్‌డౌన్‌ సహా) ఇలా జరగడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌ను పకడ్భందీగా అమలు చేస్తుండటంతో పాటు సైబర్‌ నేరగాళ్ల బారినపడి ఎవరూ భారీ మొత్తం నష్టపోకపోవడమే దీనికి కారణమని భావిస్తున్నాం. శుక్రవారం మాత్రం మూడు కేసులు నమోదు చేశాం’ అన్నారు.(నాన్న..ఇంకెంత దూరం!)

కేసులు నమోదైన నేరాలివీ..
శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మూడు నేరాలకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేశారు. నగరానికి చెందిన ఓ యువకుడు బైక్‌ ఖరీదు చేయాలని భావించి ఓఎల్‌ఎక్స్‌ లో సెర్చ్‌ చేశాడు. అందులో సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వ్యక్తిగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు రూ.34 వేలకే హైఎండ్‌ బైక్‌ విక్రయిస్తున్నట్లు పోస్టు చేశాడు. తక్కువ ధరకే వాహనం వస్తోందని భావించిన యువకుడు ఎవరికీ విషయం చెప్పకుండా ఆ మొత్తం ఆన్‌లైన్‌లో చెల్లించేశాడు. మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా వస్తుందని చెప్పిన వాహనం ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన బాధితుడు తన సోదరుడైన కానిస్టేబుల్‌కు విషయం చెప్పగా అతడివ సూచన మేరకు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అలాగే పద్మారావునగర్‌కు చెందిన ఓ వ్యక్తి నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్స్‌ ఈ–మెయిల్‌కు వచ్చే సదుపాయం ఉంది. దీన్ని గమనించిన సైబర్‌ నేరగాళ్లు తమ మెయిల్‌కు ఇవి వచ్చేలా మార్పిడి చేసి గురువారం అర్ధరాత్రి ఐదు లావాదేవీల్లో రూ.45 వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. సిటీకి చెందిన మరో మహిళ తనకు ఇంటర్నేషనల్‌ కోడ్స్‌తో కూడిన వర్చువల్‌ నెంబర్లతో బ్లాంక్‌ కాల్స్‌ వస్తున్నాయని, తిరిగి కాల్‌ చేస్తే ఎవరూ ఎత్తడం లేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు