జ్వరమా.. నో అడ్మిషన్‌! 

4 Jul, 2020 09:58 IST|Sakshi

సాధారణ జ్వరం వచ్చినా చికిత్సకు ఆస్పత్రులు ససేమిరా

కరోనా అనుమానంతో తిప్పి పంపుతున్న వైనం

వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సలహా

కరోనా ఆస్పత్రులన్నీ కిటకిట.. ఆందోళనలో బాధితులు

సికింద్రాబాద్‌: ఏటా వర్షాకాలంలో ప్రజలు సీజనల్‌ జ్వరాల బారిన పడటం సాధారణమే అయినా ఈసారి కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని చాలా ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ జ్వరాలకు సైతం చికిత్స అందించేందుకు ససేమిరా అంటున్నాయి. మలేరియా వంటి జ్వరాల బారినపడి ఎవరైనా ఆస్పత్రులకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపేస్తున్నాయి. కరోనా లక్షణాలేమోనన్న అనుమానంతో బాధితులను అంటరాని వారిగా చూస్తున్నాయి. అడిగినంత ఫీజు చెల్లించేందుకు సిద్ధమని చెప్పినా పడకలు లేవని చెబుతూ చేర్చుకొనేందుకు నిరాకరిస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని రావాలని తెగేసి చెబుతున్నాయి. (మూడు నెలలు ముప్పుతిప్పలే!)

105 డిగ్రీల జ్వరం వచ్చినా... 
రామంతాపూర్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్య జూన్‌ 28న తీవ్ర జ్వరం బారినపడటంతో ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమెను చేర్చుకోని వైద్యులు కేవలం మాత్రలు ఇచ్చి పంపారు. జ్వరం ఎక్కువ కావడంతో జూన్‌ 30న మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లగా బాధితురాలితోపాటు ఆమె భర్తను కనీసం ఆస్పత్రి లోనికి కూడా రానివ్వలేదు. 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆమెను సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ బెడ్స్‌ లేవన్నారు. పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రిలో కనబడిన వాళ్లను కాళ్లావేళ్లా బతిమిలాడినా ఫలితం కానరాలేదు. సికింద్రాబాద్‌లోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులకెళ్లినా అదే పరిస్థితి. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ వరకు కనబడిన ప్రతి ఆస్పత్రిలో సంప్రదించినా జ్వ రం అనగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తమ వద్ద బెడ్స్‌ లేవని ఎంట్రన్స్‌లోంచే తిప్పి పంపించారు. 

చివరకు ఫీవర్‌ ఆస్పత్రిలో... 
ఆస్పత్రుల్లో ప్రవేశం దొరక్కపోవడంతో తెలిసిన ఒక మిత్రుడి సూచ నతో నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి జూన్‌ 30 అర్ధరాత్రి దాటాక వెళ్లగా వైద్యులు తొలుత రెండు మాత్రలు ఇచ్చి అప్పటికప్పుడు వేసుకోమన్నారు. కొంత ఉపశమనం ఉందని బాధితురాలు చెప్పడంతో కొద్ది గంటల్లో జ్వరం పూర్తిగా తగ్గుతుందని చెప్పి మూడు రోజులకు సరిపడా ఉచితంగా మందులు ఇచ్చి డిశ్చార్జి చేశారు. 3 రోజుల్లో జ్వరం తగ్గకపోతే 3 రోజులు ఐసోలేషన్‌లో ఉండేందుకు సిద్ధమై రావాలని, అప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. తెల్లవారిన తరువాత ఇంటికి వెళ్లిన ఆ మహిళ మరుసటి రోజే పూర్తిగా కోలుకుంది. (కరోనా కేళి.. జేబులు ఖాళీ!)

హైదరాబాద్‌ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు... 
ఇటువంటి పరిస్థితి రామంతాపూర్‌కు చెందిన మహిళకే కాదు... నగరంలో నిత్యం ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. జ్వరం వస్తే కనీస చికిత్సలు చేయకుండా ఎక్కువ సంఖ్యలోని వైద్యులు నేరుగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జ్వరం తీవ్రత పెరగడం, బాధితులు ఆందోళనకు గురవుతుండటంతో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరోవైపు కరోనా టెస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఆస్పత్రుల్లో విపరీతమైన రద్దీ ఉంటుండటం, చిన్న ప్రైవేటు ఆస్పత్రులు కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పరిస్థితిని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు