మొన్నటికి రూ.20.. నేడు 60

24 Sep, 2019 08:20 IST|Sakshi

ఉల్లి కటకటపై ‘మహా’ఎఫెక్ట్‌ మహారాష్ట్రలో తగ్గిన సాగు

వర్షాలకు దెబ్బతిన్న పంటతో దేశమంతా ప్రభావం

పాకిస్తాన్‌ నుంచి దిగుమతిపై ఆంక్షలూ కారణమే..

ఎన్నికల రాష్ట్రాలకే బఫర్‌స్టాక్‌? ఇక్కడ తప్పని స్ట్రోక్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉల్లి మళ్లీ మంటెక్కిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సాగు, దిగుబడులు డీలా పడటంతో ధరలు చుక్కల్ని తాకాయి. ఈ ప్రభావం రాష్ట్రంపై నా పడుతుండటంతో ధర ఘాటెక్కుతోంది.కొద్దిరోజుల వరకు కిలో ఉల్లి ధర రూ.20 ఉండగా అది రూ.60కి చేరింది. రాష్ట్ర మార్కెట్‌లకు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది.

ధరలపై ‘మహా’ప్రభావం..
రాష్ట్రంలో ఉల్లి సాగు తగ్గింది. ఇక్కడ సాధారణ విస్తీర్ణం 13,247 హెక్టార్లు మేర ఉండగా, ఈ ఏడాది 5,465 హెక్లార్లలోనే సాగైంది. దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న ఉల్లి పూర్తిస్థాయి అవసరాలు తీరక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.ఈ ఏడాది ఉల్లి ధరలపై మహారాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉంది.దేశంలో 60 నుంచి 70% ఉల్లి ఉత్పత్తికి అదే కేంద్రంగా ఉంది.ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభం లో వర్షాలు ఆలస్యం కారణంగా ఉల్లి సాగు ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగింది. అక్కడి గణాంకాల ప్రకారం గత ఖరీఫ్‌లో 3.54లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది కేవలం 2.66లక్షల హెక్టార్లలోనే అయింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో విస్తారంగా కురిసిన వర్షాలతో వేసిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం ముంబాయి, పుణేలోనే ఉల్లి కిలో ధర రూ.57 నుంచి రూ.60 వరకు ఉంది. దీంతో వ్యాపారులు పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా, ఆఫ్గానిస్తాన్‌ల నుంచి ఉల్లిని దిగుమతి చేసి డిమాండు తీరుస్తుంటారు.ప్రస్తుతం పాకిస్తాన్‌ నుంచి దిగుమతులపై ఆంక్షలుండటంతో అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. దీనికి తోడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో ప్రభుత్వం స్థానికంగా ఉల్లి ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ రాష్ట్ర అవసరాలకే ప్రాధాన్యమిచ్చి పొరుగుకు సరఫరా తగ్గించింది. ఇక కర్ణాటకలో సెప్టెంబర్‌లోనే 35వేల క్వింటాళ్ల మేర మార్కెట్‌లోకి రావాల్సి ఉన్నా, 25వేల క్వింటాళ్లే వచ్చింది. దీంతో ఆ రాష్ట్రం పొరుగువారిని ఆదుకోలేకపోతోంది. ఈ ప్రభావం తెలంగాణలోని ధరలపై పడుతోంది. ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.45 నుంచి రూ.50 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.60కి చేరింది.ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.40 అధికం.ఇక రాష్ట్రంలో ఉల్లి సాగు చేసిన ప్రాంతాల నుంచి దీపావళి తర్వాతే సరకు రానుంది, అప్పటివరకు ధరల్లో పెరుగుదల ఉంటుందని మార్కెట్‌ వర్గాల కథనం.

ఆ బఫర్‌స్టాక్‌..మనకు స్ట్రోక్‌
ఇక ఉల్లి ధరల నియంత్రణ చేపట్టిన కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ 57వేల టన్నుల ఉల్లిని బఫర్‌ స్టాక్‌గా ఉంచింది. ధరలు పెరిగిన నేపథ్యంలో వీటిని మార్కెట్‌లోకి విడుదల చేస్తామంది. ప్రస్తు తం ఢిల్లీకి పొరుగున ఉన్న హరియాణా, మహారాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో బఫర్‌స్టాక్‌ నిల్వలు ఆయా రాష్ట్రాల అవసరాలకే విడుదల చేయొచ్చని తెలుస్తోంది. అక్కడా కిలో ఉల్లి రూ.60కి దగ్గరగా ఉంది.

మరిన్ని వార్తలు