ఇక ఆన్‌లైన్లోనే అనుమతులు

23 May, 2020 03:56 IST|Sakshi

ఇంజనీరింగ్‌ కాలేజీలకు గుర్తింపు ప్రక్రియపై ఏఐసీటీఈ

సాక్షి,హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీలకు ఆన్‌లైన్‌ ద్వారా గుర్తింపు ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపట్టింది. కోర్సుల మార్పులు లేని కాలేజీలకు ఇప్పటికే అనుమతులిచ్చిన ఏఐసీటీఈ కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు కూడా తాజాగా అనుమతుల ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా యాజమాన్యాల నుంచి వసతులు, ఫ్యాకల్టీ వివరాలతో కూడిన పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలించిన ఏఐసీటీఈ కాలేజీ యాజమాన్యాలతో ఆన్‌లైన్‌ సమావేశాలను నిర్వహణను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన కాలేజీలకు ఒక్కోరోజు సమయం ఇచ్చి వారు దరఖాస్తు చేసుకున్న కొత్త కోర్సుల నిర్వహణకు పాటించాల్సిన నిబంధనలను తెలియజేస్తోంది. తాము ఆన్‌లైన్‌లో అనుబంధ గుర్తిం పు ఇచ్చినా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా కోర్సుల నిర్వహణ ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాలేజీలతోనూ ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయం అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు.

కొత్త కోర్సులకు అనుమతి కోరిన 120 కాలేజీలు
రాష్ట్ర వ్యాప్తంగా 183 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా అందులో 60కి పైగా కళాశాలలు కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోలేదు. పాత కోర్సులను నిర్వహించేందుకే అవి దరఖాస్తు చేసుకోవడంతో ఈ నెల మొదట్లోనే గుర్తింపు జారీ చేసింది. ఈ విద్యా ఏడాది నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ బిగ్‌ డాటా, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ వంటి కోర్సులకు అనుమతిస్తామని చెప్పడంతో రాష్ట్రంలోని దాదాపు 120 కాలేజీలు ఆయా కోర్సులను ప్రవేశ పెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.

కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తనిఖీలు చేసే పరిస్థితి లేనందున ఆన్‌లైన్‌లోనే గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి జూన్‌ 15లోగా అన్నింటికీ అనుమతులిచ్చేలా ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. ఈ గుర్తింపు లభించాక రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. గతేడాది అనుబంధ గుర్తింపు ఉన్న పాత కోర్సులకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నాయి. కొత్త కోర్సుల విషయంలో మాత్రం ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకున్నాకే అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించనున్నాయి. త్వరలోనే దీనిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు