అంగట్లో అద్దెకు ఎడ్లు

9 May, 2014 03:30 IST|Sakshi
అంగట్లో అద్దెకు ఎడ్లు

 బాల్కొండ, న్యూస్‌లైన్ : ఇప్పుడు ఎడ్లు కూడా అంగట్లో అద్దెకు దొరుకుతున్నాయి. ఖరీప్ సీజన్ ముంచుకు వస్తుండటంతో రైతులు విత్తనాలు వేసేందుకు వీటిని ముందస్తుగా అద్దెకు తీసుకుంటున్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన సంతలో చాలామంది రైతులు ఎడ్లను కొనుగోలు చేయకుండా అద్దెపైనే తీసుకెళ్లారు. గత ఏడాది నెలవారీగా కిరాయిపై ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి సంవత్సరం లెక్కన గుత్తాగా అద్దెకు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఖరీప్ విత్తనాలు వేయడం పూర్తయ్యే వరకు ఎడ్లను  తీసుకెళ్తే  10 వేలు చెల్లించాలి. ఎడ్లు మార్కెట్‌లో విక్రయిస్తే ఎంత ధర పలుకుతుందో అంత సొమ్మును వ్యాపారి వద్ద  డిపాజిట్ ఉంచాలని నిబంధన పెడుతున్నారు.

పశుగ్రాసం కొరతతో
పశుగ్రాసం కొరత వల్ల సన్న,  చిన్నకారు రైతులు తమ పశువులను సాకటం కష్టమవ్వడంతో ముందుగానే విక్రయించుకున్నారు. ప్పుడు వ్యవసాయ పనులు దాదాపు యంత్రాలతోనే చేపడుతున్నారు. రైతు ఇంట సిరులు  కురిపించె పసుపు పంటను విత్తాలంటే తప్పనిసరిగా రైతు నాగలి పట్టి దుక్కి దున్నాల్సిందే. ఇందుకోసం రైతులు ఎడ్లను అద్దెకు తీసుకుంటున్నారు. అద్దెకు తీసుకుపోయిన  ఎడ్ల మేత, అవి ఉండటానికి నివాసం అంతా రైతులే ఏర్పాటు చేసుకోవాలి.

అంగట్లో నుంచి పశువులను తీసుకెళ్లేప్పుడు ఎట్లా ఉన్నాయో.. అప్పగించేప్పుడు అట్లాగే ఉండాలి. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే డిపాజిట్ తిరిగి ఇవ్వరు. వ్యాపారులు ఇన్ని నిబంధనలు పెట్టినా రైతులు ఎడ్లను కిరాయికి తీసుకుపోతున్నారు. ఎడ్లను గుత్తగా అద్దెకు తీసుకోవాలని నిబంధన లేదు. అవసర నిమిత్తం ఎనిమిది రోజుల నుంచి  నెలరోజుల వరకు తీసుకెళ్లవచ్చు.

పసుపు పంట సాధారణంగా జూన్ మధ్యలో నుంచి విత్తుతారు. ఒకే రైతుకు ఎనిమిది రోజుల పాటు పసుపు విత్తె అవసరం ఉండదు. కనుక ముగ్గురు నుంచి నలుగురు రైతులు కలిసి రెండు ఎడ్లను అద్దెకు తీసుకుం టున్నారు. యంత్రాలను, వాహనాలను అద్దెకు ఇచ్చినట్లు.. మూగ జీవాలను సైతం కిరాయి ఇవ్వడం విచారకరమే. ఒకప్పుడు పాడితో వ్యవసాయాన్ని చేసుకునే రైతు ఇప్పుడు కిరాయి పశువులతో సాగుచే యడం బాధాకరమే.

మరిన్ని వార్తలు