పింఛన్లకు బయోమెట్రిక్ విధానం

21 Jan, 2015 00:25 IST|Sakshi

డీఆర్‌డీఏ  ప్రాజెక్టు డెరైక్టర్  సర్వేశ్వర్‌రెడ్డి
తాండూరు: బయోమెట్రిక్ విధానం ద్వారా ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డీఆర్‌డీఏ  ప్రాజెక్టు డెరైక్టర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన తాండూరు మున్సిపాలిటీని సందర్శించారు. చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ గోపయ్యలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

బోగస్ పింఛన్లను తొలగించి, అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చడం కోసమే బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే రెండు,మూడు నెలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చే ఆస్కారం ఉందన్నారు.మున్సిపాలిటీల పరిధిలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా పింఛన్ల డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. 95శాతం మందికి ఖాతాలు ఉంటే ఆన్‌లైన్‌లో జమ చేసే విధానం అమలు చేయాలని సర్కారు ఆలోచన చేస్తున్నట్టు వివరించారు.  పింఛన్ల పంపిణీపై అన్ని స్థాయిల్లో  విచారణతో పాటు సోషల్ ఆడిట్ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.
 
10వరకు పింఛన్లు..
వచ్చే నెల నుంచి మండలాలు, మున్సిపాలిటీల్లో 5-10వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని పీడీ తెలిపారు.  అర్హత ఉన్నా ఆ దారు కార్డులో వయసు తక్కువ ఉన్న వారు మెడికల్‌బోర్డు ద్వారా వయసు ధ్రువీకరణ పత్రం తీసుకొని దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు వస్తుందన్నారు.  

స్థానిక అధికారులకు వయసు ధ్రువీకరణ చేసే అధికారం లేదన్నారు. గత ఏడాది చివరిలో కొన్ని నెలల పింఛన్ డబ్బులు యాక్సెస్ బ్యాంకు నుంచి డ్రా చేసినప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయని వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు. లబ్ధిదారుల ఎంపికపై సందిగ్ధం నెలకొన్నందున అభయహస్తం పింఛన్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు.
 
జిల్లాలో రూ.31.34కోట్ల పింఛన్లు
జిల్లాలో జనవరి నెలకు సంబంధించి 2,50,977 మందికి రూ.31.34కోట్ల పింఛన్లు మంజూరు అయ్యాయని పీడీ చెప్పారు. స్వ యం ఉపాధి కోసం నిరుద్యోగ యువతకు కంప్యూటర్స్, అకౌంటింగ్, బ్యూటీ పార్లర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి వికారాబాద్, చిలుకూరులో శిక్షణకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

వచ్చే నెలలో తాండూరులో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. బ్యాంకు లింకే జీ కింద జిల్లాలో మహిళా పొదుపు సంఘాలకు రూ.248కోట్ల రుణ లక్ష్యానికి గాను  రూ.201 కోట్ల రుణాల లింకేజీ జరిగిందని వివరించారు.  బంట్వారం, బషీరాబాద్ మండలాల్లో రుణాల రికవరీ తక్కువగా ఉందన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ సాజిద్‌అలీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు