‘సాక్షి’ కథనాలు వాస్తవమే

5 Apr, 2018 02:33 IST|Sakshi

మంచిర్యాలలో ప్రభుత్వ భూముల పరాధీనంపై హైకోర్టుకు జిల్లా కలెక్టర్‌ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకుని, తప్పుడు పాసు పుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయాలన్నీ వాస్తవమేనని రాష్ట్ర ప్రభు త్వం అంగీకరించింది. వీరిలో టీఆర్‌ఎస్‌ నేత తో పాటు పలువురు ఇతరులున్నారని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ హైకోర్టుకు నివేదించారు. ‘‘ఒక్క టీఆర్‌ఎస్‌ ఎంపీపీ భర్త గడ్డం భీమా గౌడ్‌ కుటుంబం స్వాధీనంలోనే 32.11 ఎకరాలుంది. జిల్లాలో మన్నెగూడెం, జోగా పూర్, గొల్లపల్లి, ఘన్‌పూర్, మైలారం, ఖమ్మంపల్లి, పుప్పాలవానిపేట గ్రామాల్లో మొత్తం 88 కేసుల్లో అనర్హులకు అధికారులు భూములు కట్టబెట్టి, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినట్లు తేలింది.

ఈ కేటాయింపులను, పాసు పుస్తకాలను రద్దు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌కు ఆదేశాలిచ్చాం. తప్పుడు పాసు పుస్తకాల ద్వారా తీసుకున్న రుణాలను వసూలు చేసుకోవాలని బ్యాంకులకు చెప్పాం. నిబంధనలకు విరుద్ధంగా పాసు పుస్తకాలు ఇచ్చిన అప్పటి తహసీల్దార్లు పి.హరి కృష్ణ, జి.వీరన్న, డి.రాజేశ్వర్‌లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కలెక్టర్‌ నివేదికపై అభ్యంతరాలుంటే పిటిషన్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి స్పష్టంచేస్తూ.. విచారణను కోర్టు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భీమా గౌడ్‌కు నోటీసులిచ్చింది. 

సాక్షి కథనాల ఆధారంగా పిల్‌ 
ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్‌ పుస్తకాలు సృష్టించి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడమే గాక వాటి ద్వారా గ్రామీ ణ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందుతున్న వైనంపై ‘సాక్షి’ ఇటీవల ప్రచురించిన వరుస కథనాలు మంచిర్యాల జిల్లాలో సంచలనం సృష్టించాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ గొల్లపల్లికి చెందిన ఇందూరి రామ్మోహనరావు ‘సాక్షి’ కథనాల ఆధారంగా హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వైనంపై విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం.. నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు