హైదరాబాద్‌లో ఒలింపిక్‌ జరిగేలా ఏర్పాట్లు చేస్తాం: కేటీఆర్‌

24 Nov, 2023 14:00 IST|Sakshi

రానున్న పదేళ్లలో 415 కిలోమీటర్లకు మెట్రో విస్తరణ

ర్యాపిడ్‌ రైల్‌ ట్రాన్సిట్‌ ద్వారా గంటలోనే హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం

24 గంటల నీటివసతి కల్పిస్తామన్న మంత్రి

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో శుక్రవారం క్రెడాయ్‌ ఆధ్వర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

‘2014 లోనే తెలంగాణలో మార్పు వచ్చింది. కొవిడ్, ఎన్నికలు మినహా మిగతా ఆరున్నరెళ్ల పాలన ప్రజల ముందుంది. 65 ఏళ్లుపాటు గత సీఎంలు పాలించిన పనితీరుతో కేసీఆర్‌ పనితీరును గమనించి రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ‘ప్రో రూరల్ ప్రో అర్బన్, ప్రో అగ్రికల్చర్‌ ప్రో బిజినెస్‌’ అనే పంథాపై కేసీఆర్ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అనుమానాలు వీడి ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఐటీ ఎగుమతులు పెరిగాయి. 2021-22 సంవత్సరానికిగాను ఐటీ ఎగుమతుల వల్ల రాష్ట్రానికి రూ.57వేల కోట్లు సమకూరాయి. వ్యవసాయ ఉత్పత్తులు పుంజుకున్నాయి. రాష్ట్ర సంపద హెచ్చయింది. 2014లో వరిధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం 14వ స్థానంలో ఉండేది. కానీ 2022లో 3.5 కోట్ల టన్నుల వరి పండించి మొదటిస్థానంలో ఉంది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 27వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం అభివృద్ధిని కేంద్ర ‍ప్రభుత్వం గుర్తించింది. ఏటా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతోంది. గతంలో క్రెడాయ్‌కు సంబంధించి కేసీఆర్‌ ఒకేరోజు ఏకంగా దాదాపు 6 జీవోలు విడుదల చేశారు. కానీ స్పష్టమైన ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే అలాంటి అవకాశం ఉండదు’ అని కేటీఆర్‌ అన్నారు. 

ఇదీ చదవండి: హైదరాబాద్‌, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..?

తిరిగి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ఏ పనులు చేస్తుందో కేటీఆర్‌ వివరించారు. ‘100 శాతం అక్షరాస్యత, ‘అందరికీ ఇళ్లు’ అనే లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాం. గతంలో హైదరాబాద్‌కు గుర్తుగా ఛార్మినార్‌ చూపించేవారు. కానీ ప్రస్తుతం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను ఉపయోగిస్తున్నారు. అందుకు క్రెడాయ్‌ ఎంతో సహకారం చేసింది. 2047 వరకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అవుతుంది. అప్పటివరకు రాష్ట్రంలో పూర్తి సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యం ఉంది. 2040 వరకు పూర్తి గ్రీన్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా మార్చాలి. వేస్ట్‌ ఎనర్జీ, వేస్ట్‌ వాటర్‌ ప్లాంట్లు పెంచాలి. వాహన, శబ్ద కాలుష్యం తగ్గించాలి. హైదరాబాద్‌ను మరింత సురక్షితంగా ఉంచేందుకు కెమెరాల సంఖ్యను పెంచాలి. 24 గంటలు నీటివసతి కల్పించాలి. హైదరాబాద్‌లో రానున్న పదేళ్లలో 415 కిలోమీటర్లకు మెట్రో విస్తరించాలి. రాష్ట్రంలో ర్యాపిడ్‌ రైల్‌ ట్రాన్సిట్‌ తీసుకురానున్నాం. దాని ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా హైదరాబాద్‌కు కేవలం గంటలో చేరుకునే అవకాశం ఉంది. అర్బన్‌ ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అమలుచేయనున్నాం. హైదరాబాద్‌ చుట్టూ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలి. 2030 వరకు హైదరాబాద్‌ను ఒలింపిక్‌ క్రీడలు జరిగేలా తీర్చిదిద్దుతాం. శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలి. అందులో అన్ని సౌకర్యాలు ఉండాలే రూపొందించాలి’ అని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు