బొండాంతో భలే ఐడియా!

4 Jan, 2020 03:40 IST|Sakshi

కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకం

అటు ప్లాస్టిక్‌కు చెక్‌.. ఇటు పర్యావరణహితం

రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా అమలు

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలో శ్రీకారం

కొబ్బరిబొండాం.. 
ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ తాగి పడేసే బొండాంలో నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి.

మొక్కల పెంపకం..
పర్యావరణానికి ఎంతో మేలు. కానీ వాటిని పెంచడానికి ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌ సంచులతో అన్నీ సమస్యలే.

ఈ రెండు సమస్యలకూ ఒకే ఒక్క చిన్న ఐడియాతో చెక్‌ పెట్టేశారు. తాగి పడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకం ద్వారా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇదంతాఎక్కడో కాదు..మన తెలంగాణలోనే!

దుగ్గొండి: సాధారణంగా ప్లాస్టిక్‌ సంచుల్లో మట్టి నింపి, అందులో విత్తనాలు వేసి మొక్కలు పెంచుతారు. ఇందుకోసం 250 నుంచి 300 గేజ్‌ ఉన్న ప్లాస్టిక్‌ సంచులను ఉపయోగిస్తారు. మొక్క పెరిగిన తర్వాత దానిని భూమిలో నాటినప్పుడు ఆ ప్లాస్టిక్‌ కవర్‌ తీసి పారేస్తారు. అది భూమిలో కలసిపోదు. ఒకవేళ దానిని కాల్చివేస్తే, అప్పుడు వచ్చే పొగ వల్ల కేన్సర్‌తోపాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధానికి భారీగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 

ఇక తాగి పడేసే కొబ్బరిబొండాలతోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. బొండాం తాగిన తర్వాత దానిని అలాగే పడేస్తుండటంతో వాటిలోకి నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి. ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాస్తవానికి ముదిరిన కొబ్బరిబొండాల తొక్కల నుంచి కోకోఫిట్, తాళ్లు తయారు చేస్తారు. అయితే, లేత కొబ్బరిబొండాలు అందుకు పనికిరావు. దీంతో వాటిని అలాగే పడేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పరిష్కారమేంటి?
తాగి పడేసే కొబ్బరిబొండాల్లో మట్టి నింపి అందులో మొక్కలు పెంచడం ద్వారా అటు ప్లాస్టిక్‌ వినియోగానికి అడ్డుకట్ట వేయడంతోపాటు ఇటు కొబ్బరిబొండాల ద్వారా తలెత్తుతున్న సమస్యల నుంచీ తప్పించుకోవచ్చు. పైగా మొక్కను బొండాంతో సహా భూమిలో నాటుకోవచ్చు. తద్వారా బొండాం భూమిలో కలిసిపోతుంది.

ఎవరిదీ ఆలోచన?
వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండల ఎంపీడీఓ గుంటి పల్లవికి ఈ వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఓ వైపు ప్లాస్టిక్‌ భూతం.. మరోవైపు వాడి పడేసే బొండాలతో ఎదురవుతున్న సమస్యలు చూసిన ఆమె మొక్కల పెంపకానికి బొండాలను వినియోగించాలనే తలంపు వచ్చింది. దీనిని రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావించారు. కేరళలో కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకంపై అధ్యయనం చేసిన తర్వాత శుక్రవారం మండలంలోని నాచినపల్లి గ్రామ నర్సరీలో ఇందుకు శ్రీకారం చుట్టారు. వెయ్యి కొబ్బరి బొండాల్లో మట్టి నింపి చింత గింజలను నాటారు. తొగర్రాయి, గిర్నిబావి, శివాజినగర్, తిమ్మంపేట, దుగ్గొండి గ్రామ నర్సరీల్లో ఇలా దాదాపు 5వేల కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకు వరంగల్, హన్మకొండ పట్టణాల్లో వాడిపడేసిన బొండాలను సేకరించారు.

ఎంతో పర్యవరణ హితం
వాడిపడేసిన కొబ్బరి బొండాల్లో మొక్కలు పెంచడం పర్యావరణ హితంగా ఉంటాయి. కేరళలో బొండాల్లో మొక్కలు పెంచుతున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆ పద్ధతిలో మొక్కలు నాటి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలనుకుంటున్నాం. కొబ్బరి బొండాల్లో పెరిగిన మొక్కను బొండాంతో సహా అలాగే భూమిలో పాతిపెట్టొచ్చు. ఆ బొండాం రెండు, మూడు నెలల్లోనే భూమిలో కరిగిపోతుంది. పైగా మొక్కకు ఎరువుగానూ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ విధానం ప్లాస్టిక్‌ నివారణకు కొంత మేరకు దోహదపడుతుంది. – గుంటి పల్లవి, ఎంపీడీవో

ఎంపీడీఓ గుంటి పల్లవి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రేపటి నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం’

హైదరాబాద్‌లో ఆ 15 ప్రాంతాలు..

ఉపాసనకు థాంక్స్‌: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

కరోనా నియంత్రణే తక్షణ కర్తవ్యం..

సినిమా

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు