అడవి బిడ్డలకు అండగా..

16 Dec, 2019 09:50 IST|Sakshi
దుప్పట్లు, దోమతెరలు, చెప్పులు అందుకున్న గొత్తికోయలతో సీఐ, ఎస్సై

ములుగు సర్కిల్‌లో 132 గొత్తికోయ కుటుంబాలు

ప్రజలతో మమేకం చేసేందుకు కృషి

సాక్షి, వెంకటాపురం(ఎం): పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ములుగు జిల్లా ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో గొత్తికోయలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు.. ఎలాంటి ఆధారం లేని వారి కుటుంబాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ ఆదేశానుసారం ములుగు సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి, వెంకటాపురం ఎస్సై భూక్యా నరహరి ఎప్పటికపుడు గొత్తికోయగూడెల్లో ఇంటింటి సోదాలు చేపడుతూ సంఘ విద్రోహశక్తులకు సహకరించకుండా అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

ములుగు మండలం కాసిందేవిపేట గ్రామ సమీప అటవీప్రాంతంలో బోడరామయ్యగడ్డ వద్ద 12 గొత్తికోయ కుటుంబాలు ఉంటుండగా, అత్యధికంగా వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని అటవీప్రాంతంలో బండ్లపహాడ్, తొర్ర చింతలపాడు, ఊట్ల తోగు, రోలుబండ, నందిపాడు, మద్దిమడుగు వద్ద ఆవాసాలు ఏర్పాటు చేసుకుని 120 గొత్తికోయ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గొత్తికోయలు సమీప గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు వెళ్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

అవగాహన.. అప్రమత్తం
ములుగు, వెంకటాపురం మండలాల పరిధిలో నివాసముంటున్న గొత్తికోయలు సంఘవిద్రోహశక్తులకు, మావోయిస్టులకు సహకరించకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్డెన్‌సెర్చ్‌ పేరుతో ఇంటింటికి తనిఖీలు నిర్వహిస్తూ గొత్తికోయలకు అవగాహన కల్పిస్తున్నారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దని, కొత్త వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ప్రజలతో కలిసిపోయేలా కృషి
బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అటవీప్రాంతంలో నివాసముంటూ జీవనం కొనసాగిస్తున్న గొత్తికోయలను ప్రజలతో మమేకం చేసేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. నాటువైద్యం చేసుకొని ప్రాణాలు కోల్పోకుండా వారికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదేక్రమంలో శనివారం వెంకటాపురం(ఎం)మండల కేంద్రంలోని వేదవ్యాస ఉన్నత పాఠశాలలో పోలీసులు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి 132 గొత్తికోయ కుటుంబాలకు 8మంది వైద్యులతో పరీక్షలు చేయించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 

మావోయిస్టులకు సహకరించొద్దు
ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో నివాసముంటున్న గొత్తికోయలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహకరించవద్దు. గొత్తికోయల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మావోయిస్టులు లొంగదీసుకునే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు తనీఖీలు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నాం. అపరిచిత వ్యక్తులెవరికి ఆశ్రయం కల్పించవద్దని, కొత్త వ్యక్తులు సంచరిస్తే మాకు సమాచారం అందించాలని సూచించాం.
– కొత్త దేవేందర్‌రెడ్డి, ములుగు సీఐ

పోలీసుల సేవలు మరువలేనివి
అడవిలో ఉంటున్న మమ్మల్ని గుర్తించి చలికాలంలో పడుతున్న బాధలు గుర్తించి మాకు పోలీసులు సాయం చేయడం ఆనందంగా ఉంది. ఒక్కో కుటుంబానికి రెండు దుప్పట్లు, దోమతెరతో పాటు ప్రతీ ఒక్కరికి చెప్పులు కూడ పోలీసు సార్లు ఇవ్వడం మరిచిపోలేము. మేము నివాసముంటున్న గుంపు(గూడెంలు)లకు పోలీసులు వచ్చి తనిఖీలు చేస్తారే తప్ప ఎప్పుడూ మమ్ముల్ని ఇబ్బంది పెట్టలేదు.
– చోడె పాండు, రోలుబండా, వెంకటాపురం 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా