పోలీసులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి

21 Oct, 2014 01:42 IST|Sakshi

తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ
 

హైదరాబాద్: తెలంగాణలో పోలీసుల సంక్షేమానికి  పెద్దపీట వేసేందుకు అనేక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినట్టు రాష్ట్ర డీజీపీ  అనురాగ్‌శర్మ  తెలిపారు. పోలీసు శాఖకు ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని నిర్మించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచి నట్టు  ఆయన తెలిపారు. పోలీసుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో .23 శాతం రిజర్వేషన్‌లను కల్పిస్తామని, ఆరోగ్య భద్రత పథకం   ద్వారా పోలీసుకుటుంబాలకు  ఆర్థికంగా చేయూతను ఇస్తామన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని  సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నక్సలైట్లు, ఉగ్రవాదులు,  సంఘవిద్రోహ శక్తులతో  పోరాడుతూ  అసువులు బాసిన పోలీసుల కుటుంబసభ్యులకు ఇచ్చే నష్టపరిహారాన్ని భారీగా పెంచామన్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ వరకు రూ.25 లక్షలు,సీఐ ఆపై స్థాయి అధికారుల కుటుంబాలకు రూ. 30 లక్షలకు పెంచినట్టు చెప్పారు.

శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 3లక్షలు పరిహారంగా  ఇస్తున్నామని వివరించారు. విధినిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానిస్టేబుళ్లతో సమానంగా వీరికి బస్‌పాస్‌లు ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు.  మంగళవారం జరిగే  అమరవీరుల సంస్మరణ పరేడ్‌కు  రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి  హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు