పోస్టల్‌ బ్యాలెట్‌ 28,057

17 Nov, 2023 04:44 IST|Sakshi

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కోసం వచ్ఛిన ‘ఫారం–12డీ’దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారులు అనుమతించిన పోస్ట ల్‌ బ్యాలెట్‌ వివరాలను గురువారం ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం మొత్తం 44,097 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అధికారులు 28,057 మంది అర్హులను గుర్తించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజవర్గం పరిధిలో 707 దరఖాస్తులు రాగా, వాటన్నిటికీ రిటర్నింగ్ అధికారులు అనుమతిచ్చారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో 706 దరఖాస్తులు రాగా వాటికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 812 దరఖాస్తులకు గాను 757 పోస్టల్‌ బ్యాలెట్‌లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం వచ్చిన 610 దరఖాస్తుల్లో 339 మాత్రమే అంగీకరించారు. అత్యల్పంగా మక్తల్‌ నియోజకవర్గ పరిధిలో 19 దరఖాస్తులురాగా, రిటర్నింగ్‌ అధికారులు అంగీకరించారు. నారాయణపేట్‌ నియోజకవర్గ పరిధి లో 28 దరఖాస్తులు రాగా, 28 దరఖాస్తులను, వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలో 30 దరఖాస్తులకుగాను 26 పోస్ట ల్‌ బ్యాలెట్‌లను అనుమతించారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలో 31 దరఖాస్తులకుగాను 31 పోస్టల్‌ బ్యాలెట్‌లు, కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో 34 దరఖాస్తు లు రాగా, వాటన్నిటినీ రిటర్నింగ్ అధికారులు అంగీకరించారు. ఎన్నికల విధులతో సంబంధం లేని 13 రకాల అత్యవసర సేవల్లో నిమగ్నమై ఉండే ఓటర్లకు తొలిసారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కల్పించాలన్న సీఈసీ ఆదేశాల మేరకు వారికీ ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్ఛినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు