పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు

11 May, 2020 12:16 IST|Sakshi
శంకర్‌పల్లి: తన ఇంట్లో చెత్త తొలగిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి

రాజేంద్రనగర్‌: బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో తమ ఇళ్లల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. కూలర్లు, ఫ్రిడ్జీలు, కుండీలు, నీరు నిల్వ ఉన్న వాటిని గుర్తించి శుభ్రం చేశారు. బండ్లగూడ కార్పొరేషన్‌ మేయర్‌ మహేందర్‌గౌడ్, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు శ్రీలతసురేష్‌గౌడ్, సాగర్‌గౌడ్, లతప్రేమ్‌గౌడ్, చంద్రశేఖర్, పద్మావతిపాపయ్యయాదవ్, శ్రవంతినరేందర్, ఆసియాఖాజా, సంతోషిరాజిరెడ్డి తదితరులు పరిశుభ్రత కార్యక్రమాలలో పాల్గొన్నారు. తమ ఇళ్లల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తమతమ డివిజన్‌ల పరిధిలో ప్రజలందరు పాల్గొనేలా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా తదితర విష జ్వరాలను దోమల ద్వారా వ్యాపించే అవకాశం ఉందన్నారు. వీటి నివారణ కోసం శుభ్రత ఎంతో అవసరమన్నారు. ఎక్కువగా నీళ్ల కులాయిలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలలో నిలిచిన నీరు, కూలర్లు, ఫ్రిడ్జీలు తదితర వాటిల్లో వృద్ధి చెందుతాయన్నారు. వీటిని శుభ్రం చేయడం ద్వారా నియంత్రణ సాధ్యమన్నారు. అందుకే మంత్రి కేటీఆర్, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పిలుపునివ్వడంతో తామంతా పాల్గొన్నట్లు వెల్లడించారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 

నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి: శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి  
శంకర్‌పల్లి: వర్షకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల నివారణకోసం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌  ఇచ్చిన పిలుపు మేరకు శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్‌ ఇంటి శుభ్రతలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మొదట ప్రజాప్రతినిధులు పరిసరాలను శుభ్రం చేసుకుంటే వారిని మరొకరు ఆదర్శంగా తీసుకొని పరిశుభ్రత పాటిస్తారని అన్నారు. ఇలాంటి కార్యక్రమం ద్వారా  ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చి పరిసరాలను శుభ్రం చేసుకుంటారని  తెలిపారు. 

మరిన్ని వార్తలు