ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వం

20 Feb, 2018 17:26 IST|Sakshi
లబ్ధిదారులతో మాట్లాడుతున్న పొన్నం

సైనిక్‌ స్కూల్‌ సాధించామనడం సరికాదు

రుక్మాపూర్‌లో నెలకొల్పేది శిక్షణ కేంద్రమే

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

చొప్పదండి: సైనిక శిక్షణ కేంద్రం ఏర్పాటును సైనిక్‌ స్కూల్‌ సాధించామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని మాజీ ఎంపీ, పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. మండలకేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రక్షణ శాఖ అధికారులు నిర్వాహకులుగా ఉండే సైనిక శిక్షణ పాఠశాలకు, రుక్మాపూర్‌లో నెలకొల్పే శిక్షణ కేంద్రానికి తేడా చెప్పకుండా ప్రజలను ఏదో సాధించినట్లు మభ్యపెట్టడం సమంజసం కాదన్నారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విద్యార్థులకు శిక్షణ కోసం ఏర్పాటు చేస్తూ, సైనిక్‌ స్కూల్‌ సాధించినట్లు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం 200ఎకరాల్లో శాతావాహన యూనివర్సిటీని ఏర్పాటు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం వైస్‌ చాన్స్‌లర్‌ను కూడా నియమించలేదన్నారు. సైనిక్‌ స్కూల్‌పై దుష్‌ప్రచారాలు మాని కోచింగ్‌ సంస్థ అని ప్రకటించాలని సూచించారు.

డబుల్‌ బెడ్‌రూం కట్టివ్వాలి
గత ప్రభుత్వ హయాంలో చొప్పదండిలో భూమి కొనుగోలు చేసి నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో డబల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టివ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై పొన్నం మండిపడ్డారు. ఇళ్ల స్థలాల వద్దకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. అధికారం ఉందని ప్రభుత్వం స్థలాలు లాగేసుకుంటూ కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని, లబ్ధిదారుల తరఫున పోరాడుతామన్నారు. నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, నాగి శేఖర్, బండ శంకర్, ఆరెళ్లి చంద్రశేఖర్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, పురం రాజేశం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు