నిలోఫర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌పై విచారణ షురూ

30 Sep, 2019 14:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర దుమారం రేపిన నిలోఫర్‌ ఆసుపత్రిలోని క్లినికల్‌ ట్రయల్స్‌పై సోమవారం విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ సోమవారం నిలోఫర్‌ బోర్డు రూమ్‌లో ఆస్పత్రి సూపరింటెండెంట్‌తోపాటు రవికుమార్‌ను విచారించింది. వీరితోపాటు ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ రాజారావు, లక్ష్మీకామేశ్వరి, విమల థామస్‌లను కమిటీ విచారిస్తోంది.

బాధితులుగా వందలాది మంది పిల్లలు
నిలోఫర్‌లో వందలాది మంది పిల్లలు ఔషధ కంపెనీల క్లినికల్‌ ట్రయల్స్‌ బాధితులుగా మిగిలారు. గతేడాది మే నుంచి ఏడాది పాటు 300 మంది పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయి. ఇన్‌పేషెంట్లుగా వచ్చిన నవజాత శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. 300 మందిలో 100 మంది ని జనరల్‌ వార్డు నుంచి, మరో 100 మందిని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (పీఐసీయూ) నుంచి, ఇంకో 100 మందిని నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ) నుంచి ఎం పిక చేశారు. వీరిపై యాంటీ బయోటిక్స్‌ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. పిల్లలు రోగాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్‌ ప్రయోగించారు. తద్వారా వారిపై అదెలా పనిచేసిందో వివరాలు సేకరించారు. ఔషధ సామర్థ్యాన్ని నిర్ధారణ చేశారు. ఈ కాలంలో ఇతర మందులతో పోలుస్తూ అధ్యయనాలు జరిగినట్లు తేలింది. ఇద్దరు వైద్యులు ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనగా, కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వారికి సహాయకులుగా ఉన్నారు. నిలోఫర్‌లో పదేళ్లుగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఈ పదే ళ్లలో 13 ట్రయల్స్‌ జరిగాయని, ఈ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై సమాచారం లేదు. అది విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు