Chandra Mohan: 'ఎన్టీఆర్‌తో చేదు ‍అనుభవం.. కానీ మంచే జరిగింది'

11 Nov, 2023 13:36 IST|Sakshi

టాలీవుడ్‌ మరో సినీ దిగ్గజం, కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు.  హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు.

(ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్‌ అయిపోతారు!)

దాదాపుగా 55 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. దశాబ్దాల పాటు కెరీర్‌ కొనసాగించిన చంద్రమోహన్‌ అప్పటి స్టార్ హీరోయిన్లందరితో సినిమాలు చేశారు. అనారోగ్యంతో కన్నుమూసిన గతంలో పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావు, రామారావుతో తన అనుభవాలను పంచుకున్నారు. రామారావు చిత్రం సందర్భంగా ఆయనకెదురైన ఓ చేదు అనుభవాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. 

గత ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ..'నాగేశ్వరరావు, నేను దాదాపు 40 సినిమాలు చేశాం. అయితే రామారావుతో నాకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ఓసారి ఎన్టీఆర్‌ సినిమా వల్ల చేదు అనుభవం ఎదుర్కొన్నా. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా మొదట నన్ను ఎంపిక చేశారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. చివరికీ బాలయ్యను తీసుకున్నారు. ఆ క్షణం నేను చాలా బాధపడ్డా. కానీ.. ఆ తర్వాత అదే సినిమాను తమిళంలో రీమేక్‌ చేసినప్పుడు ఎంజీఆర్‌ తమ్ముడిగా చేసే అవకాశం నాకు లభించింది. ఎన్టీఆర్‌ సినిమా సెట్‌లో జరిగిన ఘటన వల్లే నాకు ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం వల్లే నాకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది.'అని అన్నారు. తన కెరీర్‌లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్.. చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. కాగా.. అనారోగ్య కారణాలతో ఇవాళ మరణించారు. 

(ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్‌, చివరి దశలో సింపుల్‌గా..)

మరిన్ని వార్తలు