పీపీల కొరతతో విచారణకు విఘాతం

16 Oct, 2018 02:48 IST|Sakshi

ఇది ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది 

ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు  

ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఉభయ రాష్ట్రాల్లోని క్రిమినల్‌ కోర్టుల్లో తగినంత మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (పీపీ) లేకపోవడం నేర విచారణ ప్రక్రియకు విఘాతంగా మారుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను మూడు నాలుగు కోర్టులకు ఇన్‌చార్జీలుగా నియమిస్తుండటం వల్ల పీపీలపై పనిభారం పెరిగి కేసుల విచారణపై ప్రతికూల ప్రభావం పడుతోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న క్రిమినల్‌ కోర్టుల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కింది కోర్టుల్లో క్రిమినల్‌ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి తగినంత మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు లేకపోవడమేనని గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ వ్యవహారాన్ని సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా సిద్ధం చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఓ నోట్‌ పంపారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల నిందితుల హక్కులను పరిరక్షించడం సాధ్యం కావడం లేదని ప్రధాన న్యాయమూర్తి తన నోట్‌లో పేర్కొన్నారు. నిందితుల హక్కుల ఉల్లంఘన జరగకూడదంటే కేసుల సత్వర పరిష్కారం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు లేకపోవడం వల్ల పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, కేసుల విచారణలో నాణ్యత కూడా దెబ్బతింటోందని ఆయన తన నోట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. సీజే నోట్‌తో హైకోర్టు రిజిస్ట్రీ పీపీల కొరత వ్యవహారంపై వేర్వేరుగా రెండు వ్యాజ్యాలను సిద్ధం చేసింది. ఒక దానిలో తెలంగాణ, మరొక దానిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ రెండు వ్యాజ్యాలపై గత వారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు లేకపోవడం వల్ల కింది కోర్టుల్లో కేసుల విచారణపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది. వీలైనంత త్వరగా పీపీల కొరత తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ధర్మాసనం, ఈ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.    

మరిన్ని వార్తలు