మే రెండో వారంలో రాహుల్ రాక

27 Apr, 2015 22:07 IST|Sakshi

కరీంనగర్ : కాంగ్రెస్ యువనేత, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చేనెల రెండో వారంలో రాష్ట్రానికి రానున్నారు. ఇటీవల కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట, ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో పంట పొలాలను పరిశీలించడంతోపాటు బాధిత రైతులను పరామర్శించేందుకు రాహుల్ వస్తున్నట్లు ఏఐసీసీ నుంచి టీపీసీసీ నేతలకు సమాచారం పంపారు. రాహుల్ రాక నేపథ్యంలో ఆయన ఏయే ప్రాంతాల్లో పర్యటించాలి, ఎక్కడ బహిరంగ సభ నిర్వహించాలనే అంశాలపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణలో వడగళ్ల వానకు కరీంనగర్, నల్గొండ జిల్లాలు బాగా నష్టపోయినందున ఈ రెండింట్లో ఏదో ఒక జిల్లాలో పర్యటించాలని కోరుతున్నారు.

 

వరంగల్ ఎంపీ పదవికి ఇటీవల కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో ఇక్కడ త్వరలో ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే బాగుంటుందని ఏఐసీసీ నేతల ఆలోచన. తద్వారా సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపొచ్చని భావిస్తున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో అట్టహాసంగా నిర్వహించిన నేపథ్యంలో తదుపరి రాహుల్‌గాంధీ రాబోయే సభకు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ అవసరమని, ఆ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టుకునే నేతలెవరూ వరంగల్ జిల్లాలో కన్పించడం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఇరువురూ నల్గొండ జిల్లాకు చెందిన వారే అయినందున వరంగల్, నల్గొండ జిల్లాల సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కోరుతున్నారు. ఏఐసీసీ నేతలు కూడా ఈ మేరకు టీపీసీసీకి సంకేతాలు పంపినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు