ముసురేసింది..

3 Aug, 2019 01:55 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఎడతెరిపిలేని వర్షాలు 

వ్యవసాయ పనుల వేగం పెంచిన అన్నదాత 

సాక్షి, హైదరాబాద్‌ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దయింది. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. కొన్ని చోట్ల పూర్తిగా ముసురు నెలకొని ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం దినమంతా కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో వర్షపునీరు భూమిలో ఇంకి భూగర్భ జలాలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ వర్గాలు అంటున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖా తం, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్త నం కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో నైరుతి రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి. తెలంగాణ లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల కుండపోత నుంచి భారీ వర్షా లు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 

గత 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్‌లో 22సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే జిల్లా వెంకటాపురంలో 18సెంటీమీటర్లు, గోవిందరావుపేట, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలలో 14సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పరకాల, భద్రాచలంలో 12 సెంటీమీటర్లు, సత్తుపల్లి, బూర్గంపాడు, ఏటూరు నాగారం, మొగుళ్లపల్లిలలో 11సెంటీమీటర్లు, పినపాక, శాయంపేట, భూపాలపల్లిలలో 10సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పగటి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణంగా కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం దినమంతా హైదరాబాద్‌లో వర్షం కురుస్తూనే ఉంది. సగటున 3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో మాదాపూర్‌లో 3.9సెంటీమీటర్లు, మోండా మార్కెట్‌లో 2.2సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

రెండ్రోజుల్లో 223% అధికం 
రుతుపవనాలు ఊపందుకోవడంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో సాధారణం కంటే ఏకంగా 223% వర్షం కురిసినట్లు అర్థగణాంకశాఖ వెల్లడించింది. ఈ రెండ్రోజుల్లో సాధారణంగా 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 40.4 మిల్లీమీటర్లు కురిసింది. గతేడాది ఇదే రెండ్రోజుల్లో 5.3 మిల్లీమీటర్లు కురిసింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా ఇది 662% అధికం. జూలై 24 నాటికి రాష్ట్రంలోని 589 మండలాలకుగాను  448 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో 83 మండలాల్లో కరువు ఛాయ లు నెలకొన్నాయ ని సర్కారు నివేదిక వెల్లడించిన పది రోజుల్లోపే పరిస్థితి మారడం గమనార్హం. . 

భద్రాచలం హై అలర్ట్‌ 
భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు నీటిమట్టం 42 అడుగులకు చేరుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్ట్‌ 25 గేట్లను ఎత్తి 1,92,500 క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదల చేస్తుండగా.. ఆ వరద నీరంతా గోదావరిలోనే కలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రికి నీటిమట్టం 43 అడుగులు దాటే అవకాశం ఉంది. ఈ మార్క్‌ దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 మండలాల్లో భారీ వర్షం కురవగా.. 6 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. సత్తుపల్లి మండలంలో అత్యధికంగా 111.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుబల్లి 84.8, ఎర్రుపాలెం 77.8, సింగరేణి మండలంలో 68.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

పాలమూరులో వర్షానందం 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం రాత్రి నుంచి ముసురు వర్షం కురుస్తోంది. అత్యధికంగా దేవరకద్రలో 56.8మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉండవెల్లిలో 29మిల్లీమీటర్లు, గద్వాలలో 28.7మిల్లీమీటర్లు, అలంపూర్‌లో 27.7మిల్లీమీటర్లు, రాజోళిలో 24.5మిల్లీమీటర్లు, గట్టులో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

స్తంభించిన జనజీవనం 
కొమురం భీం జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. జిల్లాలో సిర్పూర్‌(టీ), కౌటాల, పెం చికల్‌ పేట, దహేగాం, బెజ్జూరులో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్‌–టీలో చింతకుం ట వాగు ఉధృతికి సమీపంలోని 8 గ్రామాల ప్రజల రవాణాకు అసౌకర్యం తలెత్తింది. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దహే గాం మండలంలో పలు గ్రామాలు, బెజ్జూరు లో ప్రాణహిత సరిహద్దు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అత్యధికంగా దహేగాం మండలంలో 83.04 మిల్లీమీటర్ల వర్షం పడింది. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో స్వర్ణ ప్రాజెక్ట్‌ నిండిపోయింది. 

కరీంనగర్‌లోనూ ముసురే.. 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా  భారీ వర్షంకురిసింది. ఇల్లంతకుంట మండలంలో 117.3 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 26 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి కూడా కొంత నీరు చేరడంతో.. రైతులు ఖరీఫ్‌ పనుల వేగం పెంచారు. రాజ న్న సిరిసిల్ల జిల్లాలోనూ దినమంతా తుంపరవాన పడుతూనే ఉంది. మూడేళ్ల తరువాత మూలవాగు, నక్కవాగు ప్రవహిస్తున్నాయి. జగిత్యాల జిల్లా్ల లో శుక్రవారం 731.6 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా రాయికల్‌ మండలంలో 79.2మి.మీ, అత్యల్పంగా కొడిమ్యాలలో 21.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 

వరంగల్‌లో పొంగి పొర్లుతున్న వాగులు 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం(కె) మండ ల పరిధి గంగారం గ్రామ సమీప పాలెం ప్రాజెక్టు ప్రధాన కాల్వకు రెండోసారి గండి పడింది. బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జగ్గన్నగూడెం–అంకన్నగూడెం మధ్య ఒర్రె ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిచి పోయా యి. ఏటూరు నాగారం మండలంలో పలు వాగులు పొంగి పొర్లాయి. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం వెంగ్లాపూర్‌–ప్రాజెక్టు నగర్‌ మధ్య కల్వర్టుపై నుంచి వరద వెళ్తుండడంతో వెంగ్లాపూర్, గొనేపల్లి, నార్లాపూర్, ఎల్బాక, పడిగాపూర్, మేడారం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 

అన్నదాతలో ఆనందం 
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో పంటలకు ప్రాణం పోసినట్లయిందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడ చూసినా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై కనిపించారు. మెదక్‌ జిల్లా కొల్చారం, టేక్మాల్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, అక్కన్నపేట, హుస్నాబాద్, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, రామచంద్రాపురం, సంగారెడ్డి పట్టణాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లానూ ముసురు పట్టుకుంది. రెండ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. 

నాలుగున అల్పపీడనం 
రుతుపవనాలు ఊపందుకోవడంతో శని, ఆదివారాల్లోనూ చాలాచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఈ నెల నాలుగో తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఐదారు తేదీల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా