జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి

8 Feb, 2019 12:42 IST|Sakshi
చల్లా నర్సింహారెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ)కి కొత్త సారథిగా చల్లా నర్సింహారెడ్డి నియమితులయ్యారు. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా సంస్థాగత మార్పులు చేసిన ఏఐసీసీ.. రంగారెడ్డి జిల్లాకు సరూర్‌నగర్‌ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చల్లా నర్సింహారెడ్డి పేరును ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్‌కు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మేడ్చల్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌కు బాధ్యతలను కట్టబెట్టింది.

జిల్లా కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడానికి చల్లాతో సహా జెడ్పీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ ఏనుగు జంగారెడ్డి, మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వేణుగౌడ్, దండెం రాంరెడ్డి తదితరులు పోటీపడ్డారు. అయితే, ఇందులో చివరి వరకు చల్లా, జంగారెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలించినప్పటికీ, నర్సింహారెడ్డి వైపే మొగ్గు చూపింది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇరువురు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చల్లా నాయకత్వాన్ని సిఫార్సు చేశారు. ఈమేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ పీసీసీకి లేఖ రాశారు. దీంతో ఆయన సారథ్యానికి అధిష్టానం పచ్చజెండా ఊపింది.

మల్లేశ్‌కు ఉద్వాసన 
ఆరేళ్లుగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన క్యామ మల్లేశ్‌ గత ఎన్నికల ముందు ‘హస్తం’ను వీడారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ ఆశించిన ఆయనకు నిరాశే మిగిలింది. అయితే, టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, ఏఐసీసీ దూతలు టికెట్లను అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఏకంగా ఆడియో టేపులను కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... మల్లేశ్‌ను డీసీసీ పదవి నుంచి తొలగించారు. దీంతో మల్లేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.

ఈనేపథ్యంలో ఖాళీ అయిన డీసీసీ పదవిని చేపట్టడానికి సీనియర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. శాసనసభ ఎన్నికలు ముగియడంతో పార్టీని నడపడం ఆర్థికంగా కష్టమని భావించిన ముఖ్యనేతలు.. ఈ పోస్టు వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. కాగా, పదవిని ఆశించిన వారిలో వివాదరహితుడిగా పేరొందిన చల్లాకు పీసీసీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇదిలాఉండగా, డీసీసీ పదవిని ఆశించిన ఏనుగు జంగారెడ్డి.. తనను ఎంపిక చేయకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చల్లా పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించిన తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే!  

మరిన్ని వార్తలు