విద్యతోనే మహిళలకు గౌరవం

20 Feb, 2018 16:11 IST|Sakshi
శైలజ, ప్రముఖ న్యాయవాది

నా కుటుంబమే అండ

 రాజకీయ నేపథ్యం గల కుటుంబం మాది

 ప్రముఖ న్యాయవాది శైలజ

సంగారెడ్డిజోన్‌ : స్వశక్తి, విద్యతోనే మహిళలకు గౌరవం లభిస్తుందని.. ఇందుకు సమాజ ఆలోచనా విధానంలోనూ మార్పులు రావాలని ప్రముఖ న్యాయవాది శైలజ పేర్కొన్నారు. రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన ఆమె ఎంచుకున్న న్యాయవాది వృత్తిలో రాణిస్తున్నారు. ఆమె మాటల్లో మరిన్ని వివరాలు.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీకే నారాయణరెడ్డి, జయప్రద దంపతుల మూడో కుమార్తె నేను. లెఫ్ట్‌ భావజాలం కలిగిన నాన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ప్రధాన ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్న అమ్మే మమ్మల్ని పెంచింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా మమ్మల్ని చదివించింది. అమ్మే నాకు రోల్‌ మోడల్‌. తన జీవితాన్నే మాకు పాఠంగా నేర్పింది. వేర్వేరు కుటుంబల నుంచి వచ్చి ఆదర్శ వివాహం చేసుకున్నామని అమ్మె మాకు చెప్పేది. ఈక్రమంలో భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను మాకిచ్చింది. నాటి ప్రముఖ రచయిత శరత్‌ సాçహిత్యం ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. విద్యార్థి దశలో లెఫ్ట్‌ రాజకీయాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అమ్మనాన్నల వల్ల నిజాయితీగా బతకడం నేర్చుకున్నా. ఎమ్మెల్యే కోటాలో హైదరాబాద్‌లో ఫ్లాట్‌ ఇస్తే తిరస్కరించాం. 


1985లో సంగారెడ్డిలో నేను న్యాయవాద వృత్తిని చేపట్టిన సమయంలో మహిళలు ఎవరూ లేరు. నా సీనియర్‌ కుటుంబ స్నేహితుడు చల్ల నరసింహారెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశా. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ.. నిజాయితీగా పని చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. కుటుంబంతో పాటు సమాజంపై అవగాహన కలిగి ఉండటం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నా.

సమస్యల పరిష్కారానికి చట్టాలు
సమస్యలు ఎన్ని ఉన్నయో.. వాటి పరిష్కారానికి అన్ని చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబాల ఆలోచనలో మార్పులు రావాలి. ఆడపిల్లలు అన్న చిన్నచూపు ఉండకూడదు. హంగు, ఆర్భాటం మధ్య వివాహాలు చేయడం వల్ల ఖర్చులు పెరిగి ఆడపిల్ల వివాహాన్ని తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. 

మోసపోతున్న బాలికలు
కిశోర దశలో ఉండే సందిగ్ధం, ఆకర్షణ వల్ల బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. సమాజంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బాధితులకు చట్టపరమైన రక్షణ, సమాజ సహకారంతో పాటు కౌన్సిలింగ్‌ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది.
 

మరిన్ని వార్తలు