మావోయిస్టు నేత ఆర్కే అసమర్థుడు

10 Oct, 2018 02:48 IST|Sakshi
అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే(పాత చిత్రం)

ఆయనకు స్వార్థం ఎక్కువ 

కిడారి, సివేరిల హత్యలు తప్పిదాలే.. 

మీడియాతో పురుషోత్తం, వినోదిని

సాక్షి, హైదరాబాద్‌: లొంగిపోయిన మావోయిస్టుపార్టీ కీలకనేత కోటి పురుషోత్తం ఆ పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే, గణపతిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్కే అసమర్థుడని, ఆయనకు స్వార్థం ఎక్కువని, ఎదుటివారిని ఎదగనీయడని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో పాత్రధారులం కావాలనే ఆకాంక్షతోనే జనజీవన స్రవంతిలోకి వచ్చామన్నారు. ఇటీవల ఏపీలోని విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలు ఘోర తప్పిదాలని అన్నారు. వీటిపై పార్టీలో విభేదాలు ఉన్నాయని, అందుకే ఇప్పటివరకు ఈ హత్యలపై మావోయిస్టులు ప్రకటన చేయలేకపోయారన్నారు. పాతికేళ్లు  ఆర్కే, గణపతిలతో సన్నిహితంగా మెలిగానంటున్న పురుషోత్తం మీడియా సమావేశంలో పలు విషయాలు చెప్పారు... ‘స్వయంగా ఎదిగిన ఏకలవ్యుడి వేలు కోరే ద్రోణాచార్యులు, నమ్మించి చంపే బాహుబలిలోని కట్టప్ప లాంటి వాళ్లకు పార్టీలో కొదవ లేదు. కొన్నేళ్లుగా నేను, నా భార్య వినోదిని ఈ రెంటికీ గురయ్యాం.

సుదీర్ఘకాలం ఆర్కే, గణపతిలతో కలసి ఉన్నా పార్టీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది. వేరే రాష్ట్రంలో ఉంచి అక్కడ నుంచి రావద్దంటూ డబ్బు పంపకుండా వేధించింది. అక్కడ ఎలా ఉండా లో అర్థం కాక ఎన్నో లేఖలు రాశాం. ఏ జవాబు లేదు. పార్టీలో ఎవరి మేలు వారు చూసుకుంటున్నారు. అగ్రనాయకత్వం ఒడిదుడుకుల్లో ఉంది. పదేళ్లుగా ఆర్కే, గణపతి మారతారని ఎదురుచూశాం. అనేక సందర్భాల్లో వారిద్దరూ నా భార్య వినోదిని చేతివంట తిన్నారు. ఆమె పదేళ్లుగా అనారోగ్యంతో ఉందని తెలిసినా వారు పట్టించుకోలేదు. పార్టీలో  మానవసంబంధాలు కనుమరుగయ్యాయి. అందుకే  ఉద్యమం ప్రస్తుతం ఆదివాసీలకే పరిమితమైంది. కార్యక్రమాల్లో ఉన్న లోపాల కారణంగానే యువత, విద్యార్థులు పార్టీలోకి రావట్లేదు. వారు లేకుండా ఉద్యమం ఎక్కువకాలం నడవదు. అగ్రనేతలు 2007 లో ఏపీ(ఉమ్మడి) నుంచి సెట్‌బ్యాక్, రిట్రీట్‌ అంటూ ప్రకటించారు. వారి విజన్‌ దెబ్బతినడంతోనే అప్పటి నుంచి ముందుకు పోలేకపోతున్నారు. మాలాగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న  పార్టీ క్యాడర్‌ మమ్మల్ని కలిసినప్పుడు బాధపడ్డారు. పదేళ్లుగా సెంట్రల్‌ కమిటీకీ ఉత్తరాలు రాస్తున్నా స్పందనలేదు. 1969, 1972ల్లో జరిగిన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నాను. నా జీవితంలో తెలంగాణ వస్తుందని అనుకోలేదు. 1946 నుంచి 2014 వరకు తెలంగాణ విధ్వంసమైంది. తెలంగాణ టీఆర్‌ఎస్‌ పార్టీ వల్ల 2014 నుంచి అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి ప్రజల్లో కొనుగోలుశక్తి పెరిగింది. ఆసరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అద్భుతం గా ఉన్నాయి. రాష్ట్రం కోసం మా వంతుగా సాయం చేయాలని ఆశిస్తున్నాం’అని పురుషోత్తం అన్నారు. బయటి రాష్ట్రంలో ఉండగా తాను ప్రింటింగ్‌ ప్రెస్‌ నడిపానని వినోదిని చెప్పారు. 2000లో తాను అనారోగ్యానికి గురైనా పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం తమను పట్టించుకుంటే అందులో కొనసాగేవారమే. కానీ, ఇప్పుడిక సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మరింత మంది ముందుకు రావాలి  
ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ఎత్తి చూపిస్తోంది. అజ్ఞాతంలో ఉన్న మరికొంత మంది మావోయిస్టు పార్టీ నేతలు పురుషోత్తం, వినోదినిలను స్ఫూర్తిగా తీసుకుని బయటకు రావాలి. బయటికి వచ్చినవారికి పోలీసులు అన్ని విధాలుగా సహకరిస్తారు. వారిపై ఉన్న రివార్డు మొత్తాలు వారికే అందించడంతోపాటు చిన్న, చిన్న ఉద్యోగాలు సైతం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. – అంజనీకుమార్, పోలీసు కమిషనర్‌  

మరిన్ని వార్తలు