మట్టిని దోచేశారు

28 Jun, 2019 12:58 IST|Sakshi
చెరువులో మొరం కోసం తవ్వడంతో ఏర్పడిన గుంతలు

మిషన్‌ కాకతీయ పేరిట పెద్దచెరువులో అడ్డుగోలు తవ్వకాలు

 మొరం కోసం కాంట్రాక్టర్‌ కక్కుర్తి

సాక్షి, పరకాల: మిషన్‌ కాకతీయ పనులను అడ్డం పెట్టుకొని సంబంధిత కాంట్రాక్టర్లు అడ్డగోలుగా చెరువు మట్టిని మాయం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్‌ పరకాల పెద్దచెరువు మట్టిని తరలిస్తు దర్జాగా అమ్మేసుకుంటున్నాడు. మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు కట్ట మరమతులు చేపట్టడంతో పాటు చెరువులోని నల్లమట్టిని రైతుల అవసరాలకు తరలించాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ మొరం తవ్వకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒకవైపు అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండగా లక్షలాది రూపాయాల విలువ చేసే చెరువు మొరాన్ని మూడు నెలలుగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. తన అనుచరులకు చెందిన 5 జేసీబీ వాహనాలు, 50 ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు మొరం తరలిస్తున్నారు.

ట్రాక్టర్‌ ట్రిప్పుకు మొరం మట్టికి రూ.500 నుంచి రూ.600 వరకు, నల్లమట్టికి రూ.250 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా చెరువు నుంచి వందలాది ట్రిప్పుల మొరం మాయమైంది. కట్ట మరమతులకు నాలుగైదు ట్రాక్టర్‌లను వినియోగించి మిగతాదంతా పట్టణ ప్రజల ఇళ్ల నిర్మాణ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నా అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తుంది.

పట్టణంలో ఖాళీ స్థలాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తుల చేతుల్లో ఉన్న ప్లాట్లు చెరువుమట్టితో దర్శనమిస్తున్నాయి.ఓ జేసీబీ యాజమాని ఇదే అదనుగా భావించి తనకు సంబంధించిన ఎకరం ప్లాటుకు 500 ట్రాక్టర్‌ ట్రిప్పుల మట్టిని తరలించడం చూస్తుంటే మట్టిదందా ఎంత జోరుగా సాగుతుందో స్పష్టం అవుతుంది. మిషన్‌ కాకతీయ పథకం పేరిట ఒకవైపు బిల్లులు తీసుకుంటూనే మరోవైపు చెరువు మట్టిని అమ్ముకుంటున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది.

చెరువు అంతా గుంతలమయం 
వాస్తవానికి మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులో ఒకే మాదిరిగా తవ్వకాలు చేయాల్సి ఉండగా సంబంధిత కాంట్రాక్టర్‌ తన ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ తనకు మొరం లభించిన చోటల్లా జల్లెడ పట్టినట్లు తవ్వేస్తున్నాడు. దీంతో చెరువులో భారీ గోతులు ఏర్పడ్డాయి. వర్షకాలంలో చెరువులో నీరు ఎక్కడిక్కడే నిలిచిపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు, ప్రజలు ఆ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.  ఎక్కువగోతులు ఉండడం వల్ల చెరువు నీరు తూము వద్దకు చెరుకోకుండా దూరంగానే నిలిచిపోయి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు లేకపోలేదు. 

కట్టమరమతులో నాణ్యత లోపం
చెరువు కట్ట పనుల్లో నాణ్యత కరువైంది. కట్టను వెడల్పు చేయడానికి  కాంట్రాక్టర్‌ గతంలో ఉన్న కట్ట మట్టిని సగభాగం వరకు తొలగించి మళ్లీ చెరువు మొరం మట్టిని పోయిస్తున్నాడు. అయితే గట్టిపడిన కట్టను తొలగించి మళ్లీ పనులు చేపట్టడం వెనుక కాంట్రాక్టర్‌ కక్కుర్తి స్పష్టం అవుతుంది.

ముఖ్యనేత పేరిట మట్టిదందా 
నియోజకవర్గ ముఖ్యనేత పేరు చెప్పుకుంటూ కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నాడు. పరకాల మండలంలోని నాగారంతో పాటు ఇతర చెరువుల్లో నిబంధనలకు విరుద్దంగా మట్టి తవ్వకాలు కొనసాగుతోన్నాయి. ప్రతిపక్షపార్టీల నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తరలింపును ఆపేసినట్లు సమాచారం. నేడు మళ్లీ అదే బాటలో పెద్ద చెరువు కాంట్రాక్టర్‌ నియోజకవర్గ ముఖ్యనేతకు అనుచరుడిగా చెప్పుకుంటూ చెరువు మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న చెరువు మట్టిని అడ్డుకోవాలని లేనట్లయితే చెరువులో నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు