నిఘా నీడలో శాతవాహన

27 Dec, 2017 03:04 IST|Sakshi

పోలీసు బలగాల కొనసాగింపు

డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ

కాలేజీలు, వసతిగృహాల మూసివేత

శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్‌): కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే పోలీసు బలగాలు వర్సిటీ పరిసరాల్లో నిఘా పెంచాయి. సోమవారం రాత్రి హాస్టళ్లను ఖాళీ చేయించారు. మంగళవారం వర్సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను కొనసాగించారు. వర్సిటీలో భవనాలు, బాలుర, బాలికల వసతిగృహాలు, కళాశాలలను పోలీసులు తనిఖీచేశారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా అడుగడుగునా గాలించారు.

వర్సిటీకి వచ్చిన వారిని పోలీసులు, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని వివరాలు అడిగి లోపలికి అనుమతించారు. రిజిస్ట్రార్‌ కార్యాలయం, పరిపాలన విభాగం మంగళవారం సెలవు దినమైనప్పటికి ఒకరిద్దరు సిబ్బంది విధులు నిర్వహించారు. ఉదయం నుంచే ఉస్మానియా, కాకతీయతో పాటు వివిధ వర్సిటీల నుంచి విద్యార్థి సంఘాల నాయ కులు వస్తున్నారని ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారమే విద్యార్థులు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో వర్సిటీ నిర్మానుష్యంగా మారింది. మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం.కోమల్‌రెడ్డి వర్సిటీకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.  

విద్యార్థి సంఘాలతో సీపీ సమావేశం
కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి అన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కమిషనరేట్‌లో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. విద్యార్థి సంఘాల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నా కక్ష పూరితంగా కాకుండా మంచి వాతావరణంలో తమ భావాలను వెల్లడించాలని కోరారు. వాట్సాఫ్, ఫేస్‌బుక్‌లలో అనవసరమైన పోస్టింగ్‌లు చేస్తూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని సూచించారు.

విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించి చందాల వసూళ్ళకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. సోమవారం వర్సిటీ ఘటనలో పాల్గొన్న విద్యార్థి సంఘాలపై నాన్‌ బెయిల్‌ కేసులు నమోదు చేసే అవకాశమున్నా.. వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నోటీసులు మాత్రమే ఇచ్చామని, మున్ముందు వారి తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. బుధవారం నిర్వహించే బంద్‌ను విరమించుకో వాలని కోరారు. అందుకు విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకే చేస్తున్నామని, శాంతియుతంగా జరుపుతామని వామపక్ష, బహుజన విద్యార్థిసంఘాల నేతలు సీపీకి వివరించారు. 

మరిన్ని వార్తలు