కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

20 Jun, 2019 19:24 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కన్నేపల్లి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నేపల్లి పంప్‌హౌజ్‌ వద్ద ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌజ్‌లను తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ముగ్గురు సీఎంల చేతుల మీదుగా శుక్రవారం ఈ మహాఘట్టం ఆవిష్కృతం కానుంది.

ఈ క్రమంలో ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్‌ల రాకతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మీడియా కవరేజ్‌కు సైతం అనుమతి లేదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ బ్యారేజీలు, పంప్‌ హౌజ్‌లను తెలంగాణ మంత్రులు ప్రారంభించనున్నారు. అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్ రెడ్డి, అన్నారం పంప్‌హౌజ్‌ను హోం మంత్రి మహమూద్ అలీ, అంతర్గాం మండలం గోలివాడ వద్ద సుందిళ్ల పంప్‌హౌజ్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్, ధర్మారం మండలం నంది మేడారం పంప్‌హౌజ్‌ను మంత్రి మల్లారెడ్డి, రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌజ్‌ను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలు