జనవరి తొలి వారంలో సెట్స్‌ షెడ్యూల్‌

25 Dec, 2018 01:29 IST|Sakshi

కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యా మండలి

ఆ తర్వాత సెట్స్‌ కన్వీనర్ల నియామకం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) షెడ్యూల్‌ను జనవరి మొదటి వారంలో ప్రకటించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఈ నెలాఖరులోగా షెడ్యూల్‌ను ఖరారు చేయాలని భావించినా ఈ నెల 22న నిర్వహించాల్సిన వైస్‌ చాన్స్‌లర్ల సమావేశం వాయిదా పడటంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌పై చర్చించలేదు. జనవరి మొదటి వారంలో వాటిపై చర్చించి పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌ నెలాఖరు నుంచే ప్రారంభించేలా షెడ్యూల్‌ తయారీ కోసం కసరత్తు చేస్తోంది.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా తేదీలతోపాటు పండుగ రోజలనుమినహాయించి ఇతర తేదీల్లో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ సిద్ధం చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఆయా సెట్స్‌కు కన్వీనర్లను నియమించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, పీజీ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, న్యాయ విద్యా కోర్సుల్లో చేరాలనుకునే దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

28 లేదా 29న ఏఎఫ్‌ఆర్‌సీ నోటిఫికేషన్‌
వివిధ వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు ఫీజల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ ఈ నెల 28 లేదా 29న జారీ అయ్యే అవకాశం ఉంది. గత వారమే నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఏఎఫ్‌ఆర్‌సీ భావించినా ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ చేసే సంస్థ ఖరారులో జాప్యం కావడంతో నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. కాలేజీ యాజమాన్యాల నుంచి మూడేళ్ల ఆదాయ వ్యయాలు, కొత్త ఫీజుల ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో స్వీకరించే పనులను గతంలో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ చేయగా ప్రస్తుతం నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్‌ఐసీ అధికారులతో చర్చించి ప్రతిపాదనలతో కూడిన దరఖాస్తులను స్వీకరించేందుకు తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈ నెల 28 లేదా 29న ఖరారు అయ్యే అవకాశం ఉందని పాపిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు