నిమ్స్‌లో స్తంభించిన వైద్య సేవలు

9 Aug, 2014 01:01 IST|Sakshi
నిమ్స్‌లో స్తంభించిన వైద్య సేవలు

సెమీస్కిల్డ్ ఉద్యోగుల సమ్మెతో రోగుల ఇబ్బందులు
మూడు రోజుల గడువు కోరిన డెరైక్టర్ నరేంద్రనాథ్

 
హైదరాబాద్: ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ సెమీస్కిల్డ్ ఉద్యోగులు శుక్రవారం సమ్మెకు దిగడంతో వైద్యసేవలు స్తంభించిపోయాయి. ఆస్పత్రిలోని 250 మంది ఉద్యోగులు ఉదయం 8.30 గంటలకే ఆస్పత్రికి చేరుకుని సెక్యూరిటీ కార్యాలయం వద్ద బైఠాయించారు. దీంతో ఆరోగ్యశ్రీ, ఓపీ, ఐపీ విభాగాల్లో చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి నిమ్స్‌కు చేరుకున్న రోగులకు కనీసం ఓపీ కార్డు కూడా ఇచ్చేవారే కరువయ్యారు. ఇన్‌పేషంట్లుగా ఉన్న వారు సైతం పలు రిపోర్టుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది.  క్యాష్ కౌంటర్స్‌లో ఎవరూ లేకపోవడంతో పలు శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి.  ఫార్మసీ ఉద్యోగులు కూడా సమ్మెలో వెల్లడంతో ఆసుపత్రిలోని మెడికల్ షాపులు మూతపడ్డాయి. సెమీస్కిల్డ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆసుపత్రికి వచ్చి, నిమ్స్ డెరైక్టర్‌ను కలసి ఉద్యోగుల సమస్యను వివరించగా, ఆయన ఇందుకు మూడు రోజులు గడువు కోరారు.ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ జీఓ నెంబర్68 ప్రకారం ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని, గత రెండు నెలల నుంచి ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. 

నిమ్స్ డెరైక్టర్‌నరేంద్రనాథ్ మాట్లాడుతూ జీఓ నెంబర్ 68 ప్రకారం 250 మంది ఉద్యోగులను గ్రూప్ డీ లోనే ఉంచాలని సెమీస్కిల్డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని, 250 మంది ఉద్యోగుల్లో సాంకేతిక అంశాలపై అవగాహన ఉన్న వారే గ్రూప్ డీకి అర్హులని ఆయన తెలిపారు. వీరంతా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లుగా తమ వద్ద ఎలాంటి రికార్డులు లేవని ఆయన చెప్పారు.  వీరికి ఎప్పుడు వేతన సవరణ జరిగినా అది జూన్ 31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా చూస్తామని చెప్పారు.
 
 

>
మరిన్ని వార్తలు