లక్ష్యానికి లంగరు!

12 Nov, 2014 01:33 IST|Sakshi

* ఆస్తుల క్రయవిక్రయాల్లో అనిశ్చితి.. తప్పిన అంచనాలు
* లక్ష్యాలకు దూరంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం
* హైదరాబాద్, రంగారెడ్డిలో పడిపోయిన రిజిస్ట్రేషన్లు
* ఇతర జిల్లాలు, భావి జిల్లా కేంద్రాల్లోనూ భూ విక్రయాల్లో స్తబ్దత..
* ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్య సాధన ఇప్పటికీ 52 శాతమే!
* ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోకన్నా తక్కువే
* కొత్త రాష్ర్టంగా అవతరించినా కనిపించని రియల్ బూమ్
* ధరల హెచ్చుతగ్గులపై ప్రజల్లో ఉన్న భారీ అంచనాలే కారణం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలపై అంచనాలు తలకిందులవుతున్నాయి! తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తగ్గిన రిజిస్ట్రేషన్లు కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా పుంజుకోలేదు. స్వరాష్ట్రం సిద్ధిస్తే రాజకీయ స్థిరత్వంతో ‘రియల్’ బూమ్ పునరావృతమవుతుందని రియల్టర్లు వేసిన అంచనాలు తప్పుతున్నాయి. కొత్త రాష్ట్రానికి వలసలు పెరిగి, భూముల క్రయవిక్రయాల్లో చలనం వస్తుందని ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరడం లేదు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల కాలంలో కూడా రిజిస్ట్రేషన్లలో పెద్దగా పురోగతి లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ శాఖ అంచనా వేసిన ఆదాయ లక్ష్యం ఇప్పటికీ అందనంత దూరంలో ఉండటం గమనార్హం. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే భూముల మార్కెట్ విలువలు తగ్గుతాయని కొనుగోలుదారులు, బూమ్‌లేక ఇప్పటికే పడిపోయిన ధరలు కొత్త రాష్ట్రంలో పెరుగుతాయని రియల్టర్లు భావించడమే ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సాధించిన లక్ష్యం 52 శాతమే!
అధికారికంగా జూన్ 2న రాష్ర్టం ఏర్పాటైనప్పటికీ కొత్త సంవత్సరం ఆరంభంలోనే తెలంగాణ ఏర్పాటు ఖాయమైంది. దీంతో జనవరి నుంచే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. జిల్లా కేంద్రాలు, భవిష్యత్తులో జిల్లా కేంద్రాలుగా మారుతాయని భావి స్తున్న సిద్ధిపేట, మంచిర్యాల, వికారాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జనగామ తదితర పట్టణాల్లో భూముల రేట్లు పెరిగాయి. అక్కడ రిజిస్ట్రేషన్లూ జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం (జూన్2) నాటికి మళ్లీ స్తబ్ధత ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో ఉండదని కేసీఆర్ ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రెవెన్యూ శాఖ రూ. 4,766.79 కోట్లు రాబట్టుకోవాలని అంచనా వేసింది. దీని ప్రకారం అక్టోబర్ వరకు రూ. 2,717.07 కోట్లు రాబట్టాలి. కానీ వచ్చిన ఆదాయం మాత్రం రూ.1,418.91 కోట్లు. మిగిలిన 5 నెలల్లో వంద శాతం లక్ష్యాన్ని సాధిం చాలంటే మరో రూ. 3,348 కోట్లు ఆర్జించడం సాధ్యమయ్యే పనికాదు. అదే గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లక్ష్యం రూ. 4,445.30 కోట్లు కాగా, వచ్చిన ఆదాయం రూ. 2,939.05 కోట్లు. అంటే గత ఏడాది 66.12 శాతం లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ, ఈ ఏడాది ఇంకా 52 శాతానికే పరిమితమైంది.

హైదరాబాద్, రంగారెడ్డిలోనే గండి...
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే క్రయవిక్రయాల ద్వారా 68 శాతం ఆదా యం వస్తుంది. ఈసారి రెవెన్యూ శాఖ అంచనాలో ఈ 2 జిల్లాల లక్ష్యమే రూ. 3283 కోట్లు. ఈ లెక్క ప్రకారం ఇప్పటికే రూ. 1871.85 కోట్ల ఆదాయం రావాలి. కానీ ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ. 968. 83 కోట్లు మాత్రమే. ఈ ప్రభావం మిగతా జిల్లాలపై కూడా పడినట్లు కనిపిస్తోంది.

నిజామాబాద్ జిల్లాలో 61.74 శాతం తప్ప.. ఇతర ఏ జిల్లాలో కూడా 60 శాతానికి మించి లక్ష్యాలను సాధించలేదు. అయితే గత ఏడాది రంగారెడ్డిలో 60.4 శాతం లక్ష్యాన్ని చేరగా, హైదరాబాద్‌లో 70 శాతానికిపైగా సాధించింది. అంటే రెండు జిల్లాల్లో కలిపి 65 శాతానికిపైగా రెవెన్యూ లక్ష్యాలను ప్రభుత్వం సాధించింది. మరోవైపు రాబోయే ఐదు నెలల్లో మంచి ఫలితాలే ఉంటాయని రియల్టర్లు ఆశాభావం వ్యకం చేస్తుండగా, ఆ పరిస్థితి లేదని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు