భాగ్యనగరానికి విశ్వఖ్యాతి

29 Dec, 2017 00:26 IST|Sakshi

అంతర్జాతీయ స్థాయి సదస్సులతో మారుమోగిన హైదరాబాద్‌ ఘనత

విజయవంతంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు

ఇవాంకా ట్రంప్‌ సహా వేలాది మంది విదేశీ ప్రతినిధుల హాజరు

వైభవంగా తెలుగు మహాసభలు నిర్వహించిన సర్కారు

ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు.. రోడ్‌ కాంగ్రెస్‌కూ వేదిక

2017.. భాగ్యనగరంపై చెరగని సంతకం చేసింది. అంతర్జాతీ యంగా హైదరాబాద్‌ ఖ్యాతి మారుమోగేలా చేసింది. నవంబర్‌ 28 నుంచి 3 రోజుల పాటు జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‌)’ హైదరాబాద్‌లో విజయవంతంగా జరిగింది. దానితోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సదస్సు, పురావస్తు, చారిత్రక అంశాలపై రెండు సదస్సులకూ హైదరాబాద్‌ వేదికైంది.      
– సాక్షి, హైదరాబాద్‌


ఘనంగా తెలుగు మహాసభలు
తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించింది. 1975లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికైన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ క్రీడా మైదానమే ఈ సభలకూ వేదిక అయింది. తెలంగాణ తొలిసారిగా నిర్వహిస్తుండటంతో ఈ మహాసభలను తొలి ప్రపంచ తెలుగు మహాసభలుగానే పరిగణించారు. డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ఈ అక్షరాల పండుగలో 42 దేశాల నుంచి తెలుగువారు హాజరుకావడం గమనార్హం.

తెలుగు భాషలో విభిన్న సాహితీ ప్రక్రియలు తొలుత తెలంగాణ గడ్డ మీదే మొదలయ్యాయన్న విషయాన్ని ఆధారాలతో సహా ఈ సభలు సాహితీవేత్తల ముందుంచాయి. ఇక ఏటా రెండు రోజుల పాటు తెలుగు మహాసభలను నిర్వహిస్తామని, రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు తెలుగు భాష సబ్జెక్టును తప్పనిసరిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహాసభల్లో ప్రకటించారు.


సంబురంతో మొదలై వివాదంతో..
2017 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండు భిన్న ఉదంతాలకు వేదికైంది. ఏప్రిల్‌లో ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య అతిథిగా ఇందులో పాల్గొన్నారు. ఇక జనవరిలో ఇదే ఉస్మానియా ప్రాంగణంలో ప్రతిష్టాత్మక సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు జరగాల్సి ఉంది. దానికి డిసెంబర్‌లోనే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కానీ అక్కడ అనుకూల వాతావరణం లేదన్న కారణంతో సదస్సు వేదికను మణిపూర్‌కు మార్చడం చర్చనీయాంశమైంది.


ప్రతిష్టాత్మకంగా జీఈఎస్‌–2017
వాస్తవానికి దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జీఈఎస్‌ సదస్సు జరిగింది. ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణకు ఎన్ని నగరాలు పోటీపడ్డా చివరకు అమెరికా–నీతిఆయోగ్‌లు హైదరాబాద్‌ను ఎంపిక చేయటం మన నగరం ప్రత్యేకతను చాటింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, వైట్‌హౌస్‌ సలహాదారు ఇవాంకా పాల్గొని హైదరాబాద్‌ను కీర్తించడం, రాష్ట్ర ఆతిథ్యాన్ని కొనియాడారు. అమెరికా వెళ్లిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వదస్తూరీతో లేఖ రాయటం గమనార్హం.

దేశ విదేశాలకు చెందిన 1,700 మంది పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరైన ఈ సదస్సును చిన్న లోపం లేకుండా నిర్వహించటం ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించేందుకు సరైన ప్రాంతమన్న పేరు పొందింది. వ్యవసాయం, వాణిజ్యం, విద్య, వైద్యం, ఆరోగ్యం, క్రీడలు, జీవశాస్త్రాలు, డిజిటల్‌ ఎకానమీ, మీడియా, వినోదం... తదితర అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. సృజనాత్మక ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలను ప్రోత్సహించాలని, అడ్డంకులు లేని మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో తీర్మానించారు.


రోడ్‌ కాంగ్రెస్‌ సదస్సుకూ వేదికగా..
భారత్‌లోని రహదారులు అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలంటే ఏం చేయాలన్న అంశంలో మేధో మథనానికి హైదరాబాద్‌ కేంద్రమైంది. హెచ్‌ఐసీసీలో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ 77వ వార్షిక సదస్సు జరిగింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇందులో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో.. రోడ్ల నిర్మాణంలో అనుసరించాల్సిన కొత్త పద్ధతులు, అంతర్జాతీయంగా వస్తున్న మార్పు చేర్పులు, కొత్త పరిజ్ఞానం, మన్నిక, పర్యావరణ అనుకూల విధానం తదితర అంశాలపై చర్చలు, ప్రదర్శనలు జరిగాయి.


మరిన్ని కార్యక్రమాలు కూడా
రెండేళ్లకోసారి జరిగే బాలల చలన చిత్రోత్సవాలు ఈసారీ హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రపంచ పర్యాటకుల దృష్టి తెలంగాణపై పడేలా, మన దేశంలో పర్యాటక రంగానికి విదేశీ హంగు అద్దేలా స్కాలా సదస్సు కూడా ఇక్కడ జరిగింది.  


పురావస్తు శాఖకు కొత్త ఊపు..
మానవ మనుగడ మూలాలు, చరిత్రకు సాక్ష్యాలను, తార్కాణాలను చూపేది పురావస్తు విభాగం. తెలంగాణ గడ్డ ప్రపంచంలోనే గొప్ప ప్రత్యేకతలకు నిలయంగా ఉందని నిరూపించే పలు చారిత్రక ఆధారాలు ఈ ఏడాది బయటపడ్డాయి. ఇక హైదరాబాద్‌లో చారిత్రక, పురావస్తు అంశాలపై రెండు అంతర్జాతీయ స్థాయి సదస్సులు జరిగాయి.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఒక సదస్సు, పర్యాటక భవన్‌ ప్లాజా హోటల్‌లో బుద్ధవనం ఆధ్వర్యం లో మరో సదస్సు నిర్వహించారు. వీటికి అంతర్జాతీయ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పరిధిలోని పలు చారిత్రక ప్రత్యేకతలు వారి ముందుకు వచ్చాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఇక్కడి ప్రత్యేకతలకు కొంత ప్రచారం ఏర్పడింది. ఒకప్పుడు ఈ ప్రాంతం బౌద్ధానికి కేంద్రమన్న ఆధారాలు చాటేందుకు ఈ సదస్సులు వేదికయ్యాయి.

మరిన్ని వార్తలు