పెట్‌.. ఫిట్‌..

18 Apr, 2020 08:00 IST|Sakshi

సమ్మర్‌లో పెట్స్‌పై జాగ్రత్త అవసరం

వాటిని ఎప్పుడూ గమనిస్తుండాలి

ఫుడ్‌ మెనూ తప్పకుండా మార్చాల్సిందే..

చల్లదనం ఉండేలా చూసుకోవాలి

లాక్‌డౌన్‌ కారణంగా బయటకు వెళ్లలేం..

ఇంటి చిట్కాలు గుర్తు‘పెట్‌’కోవాలి

హిమాయత్‌నగర్‌: ఇళ్లలో పెట్స్‌ను పెంచుకునేవారు వాటిని ఇంటి కుటుంబసభ్యుల్లా ట్రీట్‌ చేస్తుంటారు.. వాటిని అత్యంత ప్రేమగా చూసుకుంటారు.. చిన్న సమస్య వచ్చినా అల్లాడిపోతుంటారు.. సీజన్‌ మారుతున్నకొద్దీ వాటిపై మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. ఓ పక్క ఎండలు మండుతున్నాయి.. వేడిగాలులు మొదలయ్యాయి.. దీంతో పెట్స్‌ విలవిల్లాడుతున్నాయి. ఎప్పుడూ పెట్టే ఆహారాన్ని అయిష్టంగా తింటున్నాయి. దీంతో యజమానులు డాక్టర్లను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నా.. లాక్‌డౌన్‌ కారణంగా వాటిని బయటకు తీసుకువెళ్లాలంటే బయపడుతున్నారు. ఇళ్లలోనే వాటికి ఆహారంలో మార్పులు చేస్తున్నా.. చాలామందికి అవగాహన లేక ఇబ్బంది    పడుతున్నారు. ప్రస్తుతం 24 గంటలూ ఇళ్లలో పెట్స్‌తో కలిసి ఉంటున్నారు. పెట్స్‌ను అల్లారుముద్దుగా పెంచుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అవి హుషారుగా ఉంటాయని అంటున్నారు నారాయణగూడలోని ‘సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌’ వైద్యురాలు డాక్టర్‌ బి.స్వాతిరెడ్డి..ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

తరచూ ఇవే సమస్యలు
సమ్మర్‌లో ఎండవేడిని పెట్స్‌ తట్టుకోలేవు. వాటికి కొద్దిపాటి ఎండ తగిలితే నీరసానికి గురవుతాయి. ‘సమ్మర్‌ టిక్స్‌’ (ఎక్టో ప్యారసైటిక్‌), పెట్‌కి దోమర్లు మాదిరిగా వస్తుంటాయి. చెమట వస్తున్న కారణంగా దురదలు వ్యాపించి ఇవి వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి మంచి షాంపుతో స్నానం చేయించాలి. ప్రతిరోజూ గ్రూమింగ్‌(దువ్వాలి), ఇంట్లో వెంటిలేషన్‌(వెలుతురు) చక్కగా వచ్చేలా చూసుకోవాలి. అదేవిధంగా ‘ఎపిస్టాక్సిస్‌’కు గురవుతాయి. అంటే ఎండ, వేడి గాలికి గురైన పెట్స్‌ ముక్కు నుంచి రక్తం వస్తుంటుంది. ఇలా వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో ఐస్‌ప్యాక్‌లను ముక్కు, తల, పొట్టపై అదుముతూ ఉండాలి. ఇలా చేస్తుండటం వల్ల ముక్కు నుంచి వచ్చే బ్లీడింగ్‌ ఆగిపోయి, మామూలుగా ఉంటుంది. ఆ తర్వాత వైద్యుల సలహా తీసుకోవచ్చు. అదేవిధంగా వేడి తాపానికి పెట్స్‌ నోరు తెరిచి, నాలుక బయటపెట్టి అతి కష్టం మీద శ్వాస తీసుకుంటాయి. అలా శ్వాస తీసుకునే క్రమంలో నోట్లో నుంచి ఎక్కువగా సొల్లు కారుతుంటుంది. ఇలా చేస్తున్న పెట్స్‌కి కూడా తక్షణం మనవద్ద ఐస్‌ప్యాక్స్‌ని పెట్టి వైద్యుల సూచనలు తీసుకోవాలి.

పక్షుల్లో తెల్లని విరేచనాలు
పక్షులు ఎండవేడికి అస్సలు తట్టుకోలేవు. సమ్మర్‌లో పక్షులు సాయంత్రానికి సచ్చిపోతుంటాయి. అంటే ఉదయం నుంచి అవి సన్‌స్ట్రోక్‌కు గురయ్యాయని అని మనం నిర్ధారణకు రావాల్సిందే.. ఎండకు గురైన పక్షులు ‘రానికెపో డిసీస్‌’కి గురైనట్లు అంటే తెల్లని వీరేచనలు చేస్తుంటాయి. డల్‌గా ఉండటం, ఏమీ తినకపోవడం చేస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతకంటే ముందు వాటిని సాయంత్రం వాతావరణం చల్లబడే వరకు బయటకు రానివ్వకుండా ఉంటే వాటికే మంచిది.  

లాక్‌డౌన్‌ కారణంగా పెట్స్‌ని వాకింగ్‌కి, లెట్రిన్‌కి బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి. వాటికి బొమ్మలు ఎక్కువగా ఇచ్చి వాటిని ఆడించే ప్రయత్నం చేయాలి. తద్వారా జీర్ణం త్వరగా అయ్యి ఆరోగ్యకరంగా ఉంటాయి. కొందరు పెడిగ్రీ లాంటివి మాత్రమే పెడుతుంటారు. ఇలా కాకుండా అన్నం వండే సమయంలోనే వాటితో పాటు కర్డ్‌ రైస్, కూరగాయలను కూడా ఉడకబెట్టి ఆహారంగా పెట్టొచ్చు. అదేవిధంగా చికెన్, మటన్‌ని కూడా ఇలాగే పెడితే మంచిది. అలాగే కర్డ్‌ రైస్, ఎగ్స్, పన్నీర్‌ పెడితే ప్రొటీన్‌ ఎక్కువగా వస్తుంది.

వాటర్‌మిలాన్, కీరా, యాపిల్‌ వంటి ఫ్రూట్స్‌ కూడా ఎక్కువగా పెట్టొచ్చు.  
పెట్స్‌ ఉండే ఫ్లోర్‌ అంతా నీట్‌గా, చల్లగా ఉంచాలి. తడిగా ఉన్న ప్రదేశంలో వాటిని పడుకోబెట్టొద్దు. అలా చేస్తే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది.
24గంటలూ చల్లని వాటర్‌ అందుబాటులో ఉంచాలి. ఎంతచల్లని వాటర్‌ తాగిస్తే అంత మంచిది. వాటర్‌తో పాటు గ్లూకోజ్‌ పౌడర్‌ వేస్తే మరింత శక్తిగా ఉంటాయి.
కుక్కకు ఎక్కువగా కాళ్ల మధ్య చెమటలు వస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఏసీ లేదా కూలర్‌ ఉంటే బెటర్, లేదంటే ఫ్యాన్‌ గాలైనా ఎక్కువగా తగులుతుండాలి.

నా పెట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం
నాకు పెట్స్‌ అంటే చాలా చాలా ఇష్టం. మేం పెంచుకునే పెట్స్‌ మా ఇంట్లో చాలా స్పెషల్‌. అందుకోసం వైద్యులు చెప్పిన విధంగా అన్ని ప్రికాషన్స్‌ వాడుతుంటాం. సమ్మర్‌లో ఏసీలోనే ఉంచుతూ ప్రొటీన్‌ ఫుడ్‌ పెడుతున్నాను. ఎక్సర్‌సైజులు కూడా చేయిస్తూ.. అల్లారుముద్దుగా చూసుకుంటున్నా.– హర్షితజోషి, బిజినెస్‌ ఉమెన్, మలక్‌పేట్‌

అస్సలు బయటకు రానివ్వను
నేను బయటకు వెళ్తుంటే వెనకే వస్తుంది. నా పెట్‌ని బయటకు రానివ్వను. దానికి కావాల్సిన వాటిని తెచ్చి పెడుతుంటాను. దగ్గర ఉండీ ఫ్యామిలీ అంతా చూసుకుంటున్నాం. సమ్మర్‌లో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇంట్లో పెట్‌ మాత్రమే కాదు. స్ట్రీట్‌డాగ్స్‌ విషయంలో కేర్‌ తీసుకుంటాను.– అలేఖ్యచిన్ని, వనస్థలిపురం

>
మరిన్ని వార్తలు