స్వచ్ఛ తెలంగాణ.. అచ్ఛా మెదక్

16 May, 2015 23:27 IST|Sakshi

పట్టణం రూపురేఖల్ని మారుద్దాం
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
పట్టణంలో ‘స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ’

 
 మెదక్ టౌన్ : నాలుగేళ్లలో మెరుగైన ప్రణాళికలతో మెదక్ పట్టణం రూపురేఖలు మారుస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘అచ్ఛా మెదక్.. స్వచ్ఛ తెలంగాణ’ నినాదంతో మెదక్ ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నారు.

పట్టణాన్ని 9 సెక్టార్లుగా విభ జించి 27 వార్డుల్లో కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామన్నారు. రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం కోసం పట్టణానికి రూ.16 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. మంచినీటి కోసం రూ.25 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. ఖిల్లాపై భారీ ట్యాంకు నిర్మించి ప్రతి ఇంటికి తాగునీరందిస్తామన్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రజల అవసరాలకు సరిపోవట్లేదని, మరో రెండు మార్కెట్ల నిర్మాణానికి  కృషి చేస్తామన్నారు.

4 ఎకరాల స్థలంలో వైకుంఠధామం (శ్మశానవాటిక) ఏర్పాటు చేస్తామన్నారు. భౌతికకాయాలను తరలించేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో రూ.12 లక్షలతో వైకుంఠ రథాన్ని కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలకు మొదటి విడతగా 800 మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. 400 మందికి ప్రస్తుతం మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్డీఓ మెంచు నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ పథకాల్లో అధికారులంతా భాగస్వాములు కావాలని పిలునిచ్చారు.

మెదక్ ఏరియా ఆస్పత్రిని దత్తత తీసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని డీఎస్పీ రాజారత్నం తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్మాణ పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.   ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటి, చెత్తా చెదారాన్ని ట్రాక్టర్లలో నింపి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కమిషనర్ వెంకటేశం, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫాజిల్, మహిళ అధ్యక్షురాలు జెల్ల గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు