మెదక్‌లో గెలుపొంది.. ఉన్నత పదవుల్లోకి..!

9 Nov, 2023 09:48 IST|Sakshi
ఇందిరాగాంధీ, టి.అంజయ్య

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతిగా..

చరిత్రలో నిలిచిన నలుగురు నేతలు!

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా ఎంతో మందికి మంచి పదవులను అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ప్రముఖులుగా చరిత్రలో లిఖించింది. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసి గెలిచిన నాయకులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతి లాంటి ఉన్నతమైన పదవులు అలంకరించారు. అలా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న వారంతా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోను మెదక్‌ జిల్లాకు ఆ విధమైన ప్రత్యేక ఏర్పడింది. ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి పోటీచేసి విజయం సాధించి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు.

పద్మాదేవేందర్‌రెడ్డి..
పద్మాదేవేందర్‌రెడ్డి 2001లో టీఆర్‌ఎస్‌ అవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001లో రామాయంపేట జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం స్వరాష్ట్రం కోసం 2008లో కేసీఆర్‌ పిలుపు మేరకు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేయగా ఓడిపోయారు. ఆ తరువాత 2009లో టికెట్‌ దక్కక పోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 2014లో మెదక్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణలో తొలి ఉప సభాపతిగా పనిచేసి చరిత్రలో నిలిచారు. అనంతరం 2018లో సైతం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ
1980లో లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా ఇందిరాగాంధీ(కాంగ్రెస్‌) నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదివిని అలంకరించారు. అప్పట్లో ఇందిరాగాంధీకి 3,01,577 ఓట్లు రాగా తన ప్రత్యర్థి జనతాపార్టీకి చెందిన జైపాల్‌రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ 2,19,124 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

ముఖ్యమంత్రిగా అంజయ్య..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెదక్‌ జిల్లా రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన టి.అంజయ్య 1980 అక్టోబర్‌ నుంచి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో చెన్నారెడ్డి సీఎంగా కొనసాగుతున్న సందర్భంగా ఆయనను మార్చి అంజయ్యకు సీఎంగా అవకాశం కల్పించారు. ఆయన అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తుండగా దానికి రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక కాకుండానే సీఎం పదవి చేపట్టారు.

రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఏదో ఒక చోటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలి. ఈ నేపథ్యంలో అప్పటికే రామాయంపేట ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా టి.అంజయ్య కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామాయంపేట స్థానానికి ఎన్నికలు నిర్వహించగా ప్రతిపక్షాలు సైతం నామినేషన్‌ వేయక పోవడంతో టి.అంజయ్య ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం పదవిని అలంకరించి 16 నెలల పాటు కొనసాగారు.

ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యే గెలుపొందిన సీహెచ్‌ జగన్నాథరావు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 24 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు సుమారు ఏడు నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి: ఐదేళ్లు మీకోసం రక్తం ధారపోస్తా..! : మంత్రి గంగుల కమలాకర్‌

మరిన్ని వార్తలు