బోణి కొట్టని టీడీపీ ..!

15 Nov, 2018 08:44 IST|Sakshi

 నాడు ‘మిర్యాల’.. నేడు హుజూర్‌నగర్‌లో ..  

 ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 8సార్లు జరిగిన ఎన్నికలు 

ముచ్చటగా మూడుసార్లు ఓటమిపాలు  

సాక్షి,హుజూర్‌నగర్‌ : ఉమ్మడి రాష్ట్రంలో మార్చి 29, 1982లో ఆవిర్భవించిన టీడీపీ నాటి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి నేడు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలుపుబావుటా ఎగురవేయలేకపోయింది. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఈ ప్రాంతంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలతో  పొత్తులో భాగంగా ప్రతిసారీ వారికి అవకాశం కల్పించడంతో  టీడీపీ తన పార్టీ నుంచి అభ్యర్థిని పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించుకోలేక పోయారు. అయితే మూడు దఫాలుగా టీడీపీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఓటమి పాలు కావడంతో ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి ఎమ్మెల్యే పదవి దూరమైంది. ఉమ్మడి రాష్ట్రంలో హుజూర్‌నగర్‌ 2009 వరకు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉంది. నాడు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని గరిడేపల్లి, నేరేడుచర్ల, మఠంపల్లి మండలంలోని  7 గ్రామాలు, హుజూర్‌నగర్‌ మండలంలోని 6గ్రామాలు, చిలుకూరు మండలంలోని 2 గ్రామాలు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో కొనసాగాయి.

అయితే 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సుందరి అరుణ పోటీచేసి 54,850 ఓట్లు సాధించగా ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రేపాల శ్రీనివాస్‌ 62,314 ఓట్లు పొంది 7,464 తేడాతో విజయం సాధించారు. అదేవిధంగా 2004లో టీడీపీ అభ్యర్థిగా పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేసి 49,859 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్థి సీపీఎం పార్టీకి చెందిన జూలకంటి రంగారెడ్డి 81,014 ఓట్లు సాధించి 31,155 ఓట్ల తేడాతో విజయం సాధించారు.అనంతరం 2009లో  నియోజకవర్గాల పునర్విభజన జరిగి హుజూర్‌నగర్‌ నియోజకవర్గం ఏర్పడింది. తదుపరి 2009, 2014లలో రెండుసార్లు హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 2014లో టీడీపీ అభ్యర్థిగా వంగాల స్వామిగౌడ్‌ పోటీ చేసి 25,395  ఓట్లు పొంది 4వస్థానంలో నిలిచారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో కూడా టీడీపీ కాంగ్రెస్‌తో జత కలిసి ప్రజా కూటమిగా ఏర్పడటంతో ఈ సారికూడా ఆ పార్టీకి నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం దక్కలేదు. మొత్తంగా నాడు మిర్యాలగూడ, నేడు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో కూడా టీడీపీ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీచేసి  ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశాలను పొందలేకపోయింది. 

మరిన్ని వార్తలు