అప్పుపై పీటముడి

9 Jun, 2017 01:37 IST|Sakshi
అప్పుపై పీటముడి

► రూ.17 వేల కోట్ల రుణంపై కిరికిరి
►తెలంగాణ, ఏపీ మధ్య కుదరని సయోధ్య
►పరిష్కారానికి కేంద్ర హోం శాఖకు లేఖ


సాక్షి, హైదరాబాద్‌
తెలంగాణ, ఏపీ మధ్య చివరకు మిగిలిన అప్పుల పంపిణీపై పీటముడి పడింది. మొత్తం రూ.1.66 లక్షల కోట్ల అప్పులకు సంబంధించి అకౌంటెంట్‌ జనరల్‌ లెక్కల ప్రకారం గతేడాది మొదట్లోనే రూ.1.49 లక్షల కోట్ల మేరకు పంపిణీ ప్రక్రియ ముగిసింది. మిగతా రూ.17 వేల కోట్ల పంపిణీపై ఇప్పటికీ సయోధ్య కుదరలేదు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు ఇటీవల ఏపీ రాజధాని అమరావతికి వెళ్లి చర్చలు జరిపినా ఎవరి వాదనకు వారు కట్టుబడటంతో అప్పుల పంపకం కొలిక్కి రాలేదు.

ఇది రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివాదం కావటంతో పరిష్కార బాధ్యతను కేంద్ర హోం శాఖకు అప్పగించాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. సమైక్య రాష్ట్రంలో చేసిన అప్పుల సంగతి తేల్చాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాదే లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వమూ ఈ మేరకు లేఖ రాయవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఎక్కడ వివాదం?
నాబార్డు, హడ్కో, వివిధ బ్యాంకులు, రుణ సంస్థల నుంచి తీసుకున్న భారీ అప్పుల పంపిణీ తొలి విడతలోనే జరిగింది. కొన్ని ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పేరిట తీసుకున్న రూ.17 వేల కోట్ల పంపిణీ మాత్రం మిగిలింది. వీటికి సంబంధించి ఏ రాష్ట్రంలోని ప్రాజెక్టు/అభివృద్ధి పనికి అప్పు తీసుకుంటే అంతమేరకు రుణాన్ని ఆ రాష్ట్రమే భరించాలన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఉదాహరణకు హదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ అభివృద్ధి, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు తీసుకున్న అప్పును చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

నిర్దేశిత ప్యాకేజీలు, పనులకు తీసుకున్న అప్పులున తమ ఖాతాలో వేసేందుకు అభ్యంతరం లేదని, కానీ అనామతు పద్దులో ఉన్న మిగతా అప్పుతో కలిపి మొత్తం 42 శాతం మించకూడదని వాదిస్తోంది. విభజన చట్టం ప్రకారం మొత్తం అప్పుల వాటాలో 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ భరించాలంటోంది. అయితే, తమ పరిధిలోని ప్రాజెక్టులు, ప్యాకేజీల అప్పులను పంచుకునేందుకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం మొత్తం అప్పుల వాటా 42 శాతం మించొద్దన్న షరతును తిరస్కరించింది. దాంతో ప్రక్రియ ఆగిపోయింది.

డిస్కంల అప్పు రూ.3,200 కోట్లు
తెలంగాణ డిస్కంల నుంచి తమకు రూ.3,200 కోట్లు రావాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ మొత్తం చెల్లించిచాకే అప్పుల విషయం తేల్చుదామంటూ ఇటీవలి అధికారుల చర్చల్లోనూ మెలిక పెట్టింది. కానీ అప్పులకు డిస్కంలకు సంబంధం లేదని, ఆ విషయాన్ని డిస్కం అధికారులతోనే తేల్చుకోవాలని ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది.

నాంపల్లిలోని ట్రెజరీ ఆఫీసును పంచండి
హైదరాబాద్‌ నాంపల్లిలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ట్రెజరీ ఆఫీసును పంచాలని, అందులో తమకు వాటా ఉందని ఏపీ ప్రభుత్వం కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల బీమాపై వచ్చిన వడ్డీతో దీన్ని నిర్మించారు. ఉద్యోగుల పంపిణీ తర్వాత ఇరు రాష్ట్రాల్లోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా బీమా ఖాతాను రాష్ట్రాలు పంచుకున్నాయి. అదే మాదిరిగా అప్పటి వడ్డీతో కట్టిన భవనంలోనూ తమకు వాటా పంచివ్వాలన్నది ఏపీ ప్రభుత్వ వాదన. కానీ విభజన చట్టం ప్రకారం భౌగోళికంగా తమ ప్రాంతంలో ఉన్న ఆస్తులు తమకే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం స్పస్టం చేసింది. దీనిపైనా పీటముడి పడింది.
 

>
మరిన్ని వార్తలు