రెండు రాష్ట్రాలవీ ఉల్లంఘనలే

29 Dec, 2017 01:32 IST|Sakshi

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీలను తప్పుబట్టిన కేంద్రం

బోర్డు ఆదేశాలను ధిక్కరించారన్న కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌

మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదుపై స్పందిస్తూ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యతగా ఉన్న జలాల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించాయని కేంద్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ చేసిన కేటాయింపులకు భిన్నంగా రెండు రాష్ట్రాలూ అదనపు నీటిని వినియోగించాయని స్పష్టం చేసింది.

మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా ఇరు రాష్ట్రాలు బోర్డు ఆదేశాలను పాటించాలని సూచించింది. ఈ మేరకు గతంలో కృష్ణా బోర్డు వైఖరిని నిరసిస్తూ, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు రాసిన లేఖపై కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ స్పందించారు. హరీశ్‌రావు లేవనెత్తిన ఒక్కో అంశంపై వివరణ ఇస్తూ లేఖ రాశారు.  

బోర్డును సమర్థించిన కేంద్ర మంత్రి..
ఈ ఏడాది అక్టోబర్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డుపై మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. బోర్డు సమర్థంగా పనిచేయకపోగా.. పక్షపాత ధోరణి అవలంబిస్తోందని, ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల విషయంలో బోర్డు విఫలమైందని, దీనివల్ల ఓ పక్క సాగర్‌ ఆయకట్టుకు నీరందకపోగా... పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అధికంగా నీటిని తీసుకుందని హరీశ్‌రావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీరు తీసుకుంటే దాన్ని బోర్డు ఉల్లంఘనగా పరిగణించడం సబబు కాదని వివరించారు. పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలిమెట్రీ గణాంకాలను తారుమారు చేశారని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్‌ విన్నవించారు. కాగా, ఈ అంశాలన్నిటిపై కేంద్ర మంత్రి తన లేఖలో వివరణ ఇచ్చారు. కృష్ణా జలాల వినియోగంపై త్రిసభ్య కమిటీ చేసిన కేటాయింపులను ఉల్లంఘించి ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా, తెలంగాణ సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా అధిక వినియోగం చేశాయని తెలిపారు.

ఇక తాగు, సాగు అవసరాలకు నీటిని వాడుకున్నాకే విద్యుదుత్పత్తికి నీటిని వాడుకోవాలని కమిటీ స్పష్టంగా చెప్పినా, దాన్ని ధిక్కరించి పవర్‌ గ్రిడ్‌ అవసరాలకు నీటిని తీసుకోవడం ఏమాత్రం సబబు కాదన్నారు. దీన్ని ఉల్లంఘన కిందే పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ఏజెన్సీలు నిర్ణీత కాలంలో వాటిని అమర్చే ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా వాటిని వినియోగంలోకి తీసుకురాలేకపోయారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

హడావుడిగా వాటిని అమలు చేయలేమని, ఆ పరికరాలకు ట్రయల్‌ రన్‌ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. పోతిరెడ్డిపాడు కింద టెలిమెట్రీ వివరాలను ట్యాంపరింగ్‌ చేశారనడం సైతం అసంబద్ధ విమర్శలని పేర్కొన్నారు. సాగర్‌కు సరైన సమయంలో నీటిని విడుదల చేయలేదన్న తెలంగాణ ఫిర్యాదుపై స్పందిస్తూ, చెన్నైకి తాగునీటి సరఫరా, శ్రీశైలం కుడిగట్టు కాలువ అవసరాలకు నీటిని విడుదల చేయాలంటే శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు కొనసాగించాల్సి ఉంటుందని, ఈ దృష్ట్యానే సాగర్‌కు నీటిని విడుదల చేయలేదని తన లేఖలో వివరించారు. ఇలా అన్ని అంశాల్లో బోర్డు తీరును సమర్థిస్తూనే కేంద్రం, రాష్ట్ర ఫిర్యాదుపై వివరణ ఇచ్చింది.  

వర్కింగ్‌ మాన్యువల్‌పై 10 లోగా అభిప్రాయాలు చెప్పండి
కాగా బోర్డు నిర్వహణపై రూపొందించిన వర్కింగ్‌ మాన్యువల్‌ ఖరారుకు తెలుగు రాష్ట్రా లు అభిప్రాయాలను వచ్చే జనవరి 10లోగా తెలపాలని కృష్ణాబోర్డు కోరింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు గురువారం లేఖలు రాసింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల సూచనల మేరకు మార్పులు చేశామని, తుది అభిప్రాయం చెబి తే దాన్ని ఖరారు చేస్తామని వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు