బంద్‌కు భారీ బందోబస్తు

28 May, 2014 22:56 IST|Sakshi

అనంతగిరి, న్యూస్‌లైన్: పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం తెలంగాణ  బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. బీఎస్‌ఎఫ్‌కు చెందిన 3 ప్లటూన్లను చేవేళ్ల, తాండూరు, వికారాబాద్ పట్టణాలకు తరలిస్తున్నామన్నా రు. ఒక్కో ప్లటూన్‌లో 35 మంది పోలీసులు ఉంటారన్నా రు. అదేవిధంగా 3 ప్లటున్ల ఏఆర్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 15 మంది చొప్పున ఉం టారన్నారు. ఎవరూ వ్యాపార, వాణిజ్య సముదాయాలను బలవంతంగా మూసివేయడానికి ప్రయత్నించవద్దని సూ చించారు.

వికారాబాద్, తాండూరు, పరిగి బస్సు డిపోల్లో అర్ధరాత్రి నుంచే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసిన ట్లు ఎస్పీ తెలిపారు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలోనూ ప్రత్యేక బలగాలను మోహరిస్తామన్నారు. వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌర స్తా, బీజేఆర్ చౌరస్తా, ఎంఆర్‌పీ, కొత్తగడి, తాండూరులోని ఇందిరా చౌక్, శివాజీ చౌక్, గాంధీ చౌక్, భద్రేశ్వర చౌక్‌ల లో, పరిగి, చేవేళ్ల ప్రధాన రహదారులపై ప్రత్యేక పికెటింగ్ ఉంటుందన్నారు. 30 యాక్టు ఇంకా అమలులోనే ఉందన్నారు.

ఎవరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని రాజకుమారి పేర్కొన్నారు. అనుమతి లేకుండా ధర్నాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. పోలీసులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. బంద్‌ను  డీఎస్పీలు ప్రత్యేక పర్యవేక్షిస్తారని చెప్పారు. బుధవారం అర్ధరాత్రి నుంచి పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రధాన రహదారులపై గురువారం దాకా పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బీఎస్‌ఎఫ్, ఏఆర్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశామని ఎస్పీ రాజకుమారి స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు