మిషన్‌ భగీరథకు అడ్డంకులు

31 Jul, 2018 01:58 IST|Sakshi

ఆగస్టు 15న ఇంటింటికీ రక్షిత నీటి సరఫరా సాధ్యం కాకపోవచ్చు

గవర్నర్‌కు నివేదించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

షెడ్యూల్‌ 10 ఆస్తులపై కేంద్రం వివరణపట్ల హర్షం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచి ఇంటింటికీ మిషన్‌ భగీరథ పథకం ద్వారా రక్షిత నీటి సరఫరా ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం ఆచరణలో సాధ్యం కాకపోవచ్చని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామా ల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి కొంత సమయం కావాలని ఆయన గవర్నర్‌ నరసింహన్‌కు నివేదించారు. సీఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమై తాజా పరిపాలన విశేషాలు, రాజకీయ పరిణామాలపై చర్చిం చారు.

బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు కోసం అక్కడి స్థలాన్ని అప్పగించాలని కేంద్రం ఇటీవల రాష్ట్రానికి లేఖ రాసిందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రైతు బీమా పథకాన్ని ప్రారంభించేందుకు చేస్తున్న ఏర్పాట్లను గవర్నర్‌కు వివరించారు. వచ్చే నెలలో కొత్తగా ఏర్పాటుకానున్న 68 మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

బహిష్కృత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాన్ని పునరు ద్ధరించాలంటూ తామిచ్చిన తీర్పును అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు... ఈ కేసులో అవసరమైతే న్యాయశాఖ కార్యదర్శితోపాటు అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటిసులు జారీ చేస్తామని హెచ్చరించడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన పరిణామాలను సీఎం గవర్నర్‌కు తెలియజేశారు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లోని ఆస్తులను పంచాలని ఆ చట్టంలో ఎక్కడా లేదని కేంద్ర హోంశాఖ గత శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంపట్ల ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న 10వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులపై పూర్తిగా తెలంగాణకే హక్కు ఉందని ఆయన గవర్నర్‌కు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు