ప్రైవేటు ఆస్పత్రులకు కేసీఆర్‌ వార్నింగ్‌

17 Jul, 2020 16:48 IST|Sakshi

హైరానా పడి ప్రైవేట్‌ ఆస్పత్రులకు పోవద్దు

కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి

కేంద్రమే గందరగోళ పరిస్థితుల్లో ఉంది : కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రైవేటు ఆస్పత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనాతో ప్రజలు హైరానా పడి ప్రైవేట్‌ ఆస్పత్రులకు పోవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొందని, వైరస్‌ విషయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాల్సిందేనని మనోధైర్యాన్ని నింపారు. రాష్ట్రంలో అంత భయంకరమైన పరిస్థితి లేదని, అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యానికి తావివ్వకూడదు సూచించారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో వైద్యశాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. (సర్కార్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు)

యూజీసీ స్కేలు వేతనాలు
అధికారులతో సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కావాల్సిన అన్ని సౌకర్యాలు వేగంగా సమకూర్చుకున్నాం. గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రుల్లో 3వేల బెడ్లు ఆక్సిజన్‌ సౌకర్యంతో ఉన్నాయి. వైద్య కళాశాలల్లో పని చేసే అధ్యాపకులకు యూజీసీ స్కేలు వేతనాలు చెల్లిస్తాం. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు అందిస్తాం. ఆయుష్‌ అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 65ఏళ్లకు పెంచేలా నిర్ణయం తీసుకుంటాం. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, పోలీసులు, మున్సిపల్‌, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కోవిడ్‌ ఇన్సెంటివ్‌ కొనసాగిస్తాం. పీజీ పూర్తి చేసిన 1200 వైద్య విద్యార్థులను మందిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవాలి. పీహెచ్‌సీల్లో 200 మంది డాక్టర్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలి. (విద్యార్థులకు శుభవార్త: కేసీఆర్‌ కీలక నిర్ణయం)

ప్రతిపక్షాల చిల్లర విమర్శలు
కరోనాపై ముందు కేంద్రమే గందరగోళ పరిస్థితుల్లో ఉండేది. దేశవ్యాప్తంగా ఆన్‌ లాక్‌ ప్రక్రియ నడుస్తోంది. అంతర్జాతీయ విమానాలు నడపాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అవగాహన లేకుండా ప్రతిపక్షాలు చేసే చిల్లరమల్లర విమర్శలు పట్టించుకోవద్దు. తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడానికి వైద్యులు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షాలు తీరు సరైనది కాదు.’ అని వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు