పోలీస్ కం బ్యాక్

17 Jul, 2014 03:06 IST|Sakshi

ఖమ్మం క్రైం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాల్లో పనిచేస్తున్న 246 మంది పోలీసులు వెనక్కు రానున్నారు. అతి త్వరలో వారికి ఉత్తర్వులు అందనున్నాయి. ఆంధ్రలో విలీనమయ్యే భద్రాచలం (పట్టణం మినహా), కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, మోతుగూడెం, వీఆర్‌పురం ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావం అత్యధికంగా ఉంది. ఈ మండలాలు రాష్ట్రానికి సరిహద్దులో ఉండటం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడూ మావోయిస్టులు, పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది.

 ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని మావోయిస్టులు కూడా ఈ ప్రాంతాలకు వచ్చి తలదాచుకుంటారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. విలీనమయ్యే ప్రాంతాల్లో రెండు సర్కిల్‌లు భద్రాచలం, చింతూరులో ఉన్నాయి. వీటిలో ఇద్దరు సీఐలు, 11మంది ఎస్‌ఐలు, 18 మంది ఏఎస్సైలు, 32 మంది హెడ్ కానిస్టేబుల్స్, 183 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఉత్తర్వులు అందగానే జిల్లా ఎస్పీకి రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

 ఆంధ్ర పోలీసులకు సవాలే...
 విలీనమైన ఏడు మండలాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొన్ని ఏళ్లుగా విస్తృతంగా కొనసాగుతున్నాయి. వాటిని అరికట్టడం కోసం జిల్లాకు చెందిన స్పెషల్‌పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ దళాలు, ఆయా మండలాల స్టేషన్‌ల సిబ్బంది విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఈ ప్రాంతాల్లో దట్టమైన అడవి ఉండటంతో ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసులకు అడవిపై పూర్తి అవగాహన ఉంది. వారికి మావోయిస్టులు ఎక్కడ తలదాచుకుంటారో.. ఎక్కడ మందుపాతరలు అమర్చి ఉంటారో పసి కట్టే నైపుణ్యం ఉంది. మావోయిస్టు కార్యకలాపాలపై పూర్తి అవగాహన ఉన్నవారినే ఈ ఏడు మండలాల్లో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందిగా నియమిస్తుంటారు. దీనికితోడు ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి మావోయిస్టులు కార్యకలాపాలపై పూర్తి నిఘా ఉంటుంది. ఈ మండలాలు ఆంధ్రలో విలీనం కావడంతో అతిత్వరలో బాధ్యతలు చేపట్టే ఆంధ్ర పోలీసులకు మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడం పెద్ద సవాలే అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఇప్పటి వరకు వారికి ఈ ఏజెన్సీ ప్రాంతాలపై అవగాహన లేదు. మండలాలు విలీనమయ్యే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నప్పటికీ మావోయిస్టు కార్యకలాపాల ప్రభావం ఎక్కువగా ఉండదు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మావోయిస్టుల కార్యకలాపాలపై ఆంధ్రా పోలీసులకు అంతగా అవగాహన లేదు. విలీనమయ్యే ఏడుమండలాల్లో మావోయిస్టు కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం.

 జిల్లా పోలీసుల సహకారం తప్పనిసరి...
 ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాల్లో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంతో పాటు అవి పెరగకుండా ఉండాలంటే ఆంధ్రా పోలీసులు జిల్లా పోలీసుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. జిల్లా పోలీసులతోపాటు ఈ ఏడు మండలాల్లో గతంలో పనిచేసిన యాంటీ నక్సల్స్ స్క్వాడ్‌తోపాటు స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ దళాల వద్దనుంచి సమాచారం సేకరించి మావోయిస్టుల కదలికలపై ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది.

 వెనక్కు వచ్చే పోలీసుల వివరాలు
 ఇలా ఉన్నాయి...
 ఆంధ్రప్రదేశ్‌లో ఏడు మండలాలు విలీనం అవుతుండటంతో ఆయా మండలాల్లో పనిచేస్తున్న పోలీసులను వెనక్కు పిలిపిస్తున్నారు.

 భద్రాచలం రూరల్‌లో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్, చింతూరులో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్, కుక్కునూరు నుంచి ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 21 మంది కానిస్టేబుల్స్, వేలేరుపాడు నుంచి ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, 21మంది కానిస్టేబుల్స్, కూనవరం నుంచి ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, 21 మంది కానిస్టేబుల్స్, మోతుగూడెం నుంచి ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్, వీఆర్‌పురం నుంచి ఒక ఎస్సై, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుల్స్, 30 మంది కానిస్టేబుల్స్ వెనుక్కు రానున్నారు.

మరిన్ని వార్తలు