వైద్య పరికరాల కొరత ఉండటం సహజమే: హైకోర్టు

10 Apr, 2020 02:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోందని, ఇదో ప్రపంచ విపత్తు అని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వమే అన్నీ చేయాలని ఆశించడం సబబు కాదని వ్యాఖ్యానించింది. వైద్య పరికరాల కొరత ఉండటం సహజమని, ఉ న్నంతలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని, ఉన్నంతలో వైద్యం అందించేందుకు అవసరమైన అత్యవసర చర్యలు తీసుకుంటున్నారో లేదో అనేదే ముఖ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యం లో కరోనా బాధితులకు చికిత్స చేసే వైద్యులకు తగిన రక్షణ పరికరాల్లేవని, రాష్ట్రాల సరిహద్దుల్లోని క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు కల్పించాలని కోరుతూ న్యాయవాదులు సమీర్‌ అహ్మద్, ఎస్‌.ఎస్‌.ఆర్‌.మూర్తి, ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావులు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు మరో సారి విచారణ జరిపింది.

ప్రభుత్వం వైద్యపరంగా అ న్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఇబ్బందులు పడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని ప్రభు త్వం తరఫున కోర్టుకు అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ మధ్యంతర నివేదిక అందజేశారు. ఈ నివేదిక వాస్తవం కాదని లాయర్లు చెప్పడంతో ప్రధాన న్యా యమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జ స్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం పైవిధంగా అభిప్రాయçపడుతూ విచారణను 15కి వాయిదా వేసింది. 

మాస్క్‌లు, గ్లౌజ్స్‌లకు ఆర్డర్లు ఇచ్చాం.. 
‘కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వైద్య సేవలు అందించే వారందరికీ మా స్క్‌లు, గ్లౌజ్‌లు, దుస్తులు అన్నింటినీ సమకూర్చాం. ఆస్పత్రుల్లోనే కాకుండా అనుమానితుల ఇళ్లకు వెళ్లే వా రికి కూడా వ్యక్తిగత వైద్య రక్షణ పరికరాలు (పీపీఈ) అందజేస్తున్నాం. వీటన్నింటినీ రాష్ట్ర మెడికల్‌ సర్వీసె స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తోంది. దేశంలోనే కాకుండా యావత్‌ ప్రపంచంలోనే పీపీఈ కిట్ల కొరత ఉంది. 3,31,798 పీపీఈ కిట్లు కా వాలని ఆర్డర్లు జారీ చేశాం. ఇప్పటికి 47,603 కిట్లు వచ్చాయి. మిగతావి కూడా దశల వారీగా వస్తాయి. సర్జికల్‌ గ్లౌజ్స్‌ 34 లక్షలు ఆర్డర్‌ ఇస్తే 10.34 లక్షలు అందాయి. అయితే ప్రభుత్వం వద్ద 23 లక్షల గ్లౌజ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో మం దుల షాపులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు’అని ప్రభుత్వం మధ్యంతర నివేదికలో పేర్కొంది.

మరిన్ని వార్తలు