తుంగభద్రపై కర్ణాటక కొత్త ఎత్తులు!  

18 Aug, 2019 02:02 IST|Sakshi

పూడికతో తగ్గిన నిల్వల మేరకు 31 టీఎంసీలతో కొత్త బ్యారేజీ 

తుంగభద్ర బోర్డు భేటీలో తెలంగాణ అభ్యంతరం 

ఆర్డీఎస్‌లో 15.90 టీఎంసీల వాటాకు 5 టీఎంసీలే దక్కుతోందని స్పష్టీకరణ

నిర్ణీత వాటా వచ్చేలా చూస్తేనే బ్యారేజీకి సమ్మతిస్తామన్న తెలంగాణ

సాక్షి, హైదరాబాద్‌: తుంగభద్రనదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక ఎత్తులు వేస్తోంది. డ్యామ్‌లో పూడిక వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకుగాను కొత్త రిజర్వాయర్‌ నిర్మాణానికి సిద్ధమైంది. 31 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్రకు ఎగువన నవాలి ప్రాంతంలో నిర్మించే కొత్త రిజర్వాయర్‌పై కర్ణాటక తుంగభద్ర బోర్డు అనుమతి కోరింది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని తెలంగాణ, ఏపీలను బోర్డు కోరగా, ఆర్డీఎస్‌ ఎడమ కాల్వ కింద నీటి అవసరాలకు ఈ నిర్మాణం ఆటంకపరుస్తుందని తెలంగాణ స్పష్టం చేసింది. 

52 టీఎంసీల కోసం కర్ణాటక ప్రతిపాదన 
తుంగభద్ర డ్యామ్‌లో గతంలో ఉన్న నీటినిల్వ సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా నిల్వ తగ్గింది. 1953లో డ్యామ్‌ ప్రారంభం సమయంలో 132 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 100 టీఎంసీలకు పడిపోయింది. ఈ నష్టాన్ని పూడ్చేలా దాదాపు 31 టీఎంసీల సామర్థ్యంలో నవాలి వద్ద రిజర్వాయర్‌ నిర్మించాలని కర్ణాటక నిర్ణయించింది. తుంగభద్ర కింద 212 టీఎంసీల నీటిని వినియోగించేకునేలా గత ట్రిబ్యునళ్లు అనుమతించినా, పూడికతో 172 టీఎంసీల నీటినే వినియోగిస్తున్నామని, కొత్త రిజర్వాయర్‌తో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందని గత డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో కర్ణాటక తెలిపింది. భారీవరద ఉన్నప్పుడు తుంగభద్ర నది నుంచి వరద కాల్వ తవ్వి, రోజుకు 17,900 క్యూసెక్కుల నీటిని కొత్త రిజర్వాయర్‌కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల సామర్థ్యాన్ని పెంచుతామని, ఈ 3 రిజర్వాయర్ల కింద మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. 

దిగువకు నష్టమే...
నిర్మాణం చేపట్టబోయే రిజర్వాయర్‌ డీపీఆర్‌లు సమర్పిస్తే వాటిని పరిశీలించి అభిప్రాయాలు చెబుతామని తెలుగు రాష్ట్రాలు బోర్డుకు తెలిపాయి. అయినా ఇంతవరకు కర్ణాటక డీపీఆర్‌లు ఇవ్వలేదు. శనివారం బెంగళూరులో జరిగిన సమావేశంలో తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ సమర్థంగా రాష్ట్ర వాదనలను వినిపించినట్లు తెలిసింది. డీపీఆర్‌లతోపాటే ఎగువన తుంగ, భద్ర నదుల్లో కర్ణాటక చేస్తున్న నీటి వినియోగం, మరిన్ని ఎత్తిపోతల ద్వారా తీసుకుంటున్న నీటిలెక్కలను తమ ముం దుంచాలని స్పష్టం చేశారు. ఆర్డీఎస్‌ ఎడమ కాల్వ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల మేర కేటాయింపులున్నా, 5 టీఎంసీలకు మించి నీరు రావట్లేదని బోర్డు దృష్టికి తెచ్చినట్లు సమాచారం. దీంతోపాటే  ట్రిబ్యునల్‌ కేటాయింపులకు విఘా తం కలుగుతుందని బోర్డు దృష్టికి తెచ్చారు. తుంగభద్రసహా కొత్త బ్యారేజీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిర్ణీత వాటాలు వచ్చేలా చూస్తామని కచ్చితమైన హామీ ఇస్తేనే బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి స్తామన్నారు. డీపీఆర్‌లు ఇచ్చాకే దీనిపై అభిప్రా యం చెబుతామని ఏపీ చెప్పినట్లుతెలిసింది.  

>
మరిన్ని వార్తలు