11మందిని పొట్టన పెట్టుకుని? 

12 Dec, 2023 14:58 IST|Sakshi

మాయలు, మంత్రాలు.. ఆనక హత్యలు

మాయలు, మంత్రాలతో బురిడీ కొట్టిస్తున్న మాయగాడు!

ఓ నరహంతకుడి నేరచరిత్రను వెలికితీస్తున్న ఖాకీలు 

నాగర్‌కర్నూల్‌లో మాయగాడు సత్యనారాయణ బాగోతం 

నేడు వివరాలు వెల్లడిస్తామంటున్న పోలీసులు 

సత్యనారాయణ బాగోతాలపై గతంలోనే సాక్షి కథనం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేయడం.. ఎవరైనా ఎదురుతిరిగితే మట్టుబెట్టడం.. ఇలా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని∙పొట్టన పెట్టుకున్నాడని భావిస్తున్న ఓ నరహంతకుడిని నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ యాదవ్‌ కొన్నేళ్లుగా తనకు మంత్రాలు, మాయలు తెలుసునంటూ అమాయక మహిళలు, వ్యక్తులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు.'

తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని, కుటుంబ కలహాలు, సమస్యలను పరిష్కరిస్తానంటూ మొదట తనకు పరిచయం అయిన వారిని నమ్మిస్తాడు. ఈ క్రమంలో వారి పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తిపాస్తులను తన పేరిట, అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటాడు. ఎవరైనా తిరగబడితే గుట్టుచప్పుడు కాకుండా పథకం ప్రకారం హత్యకు తెగబడతాడని బాధితుల నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.

ఇలా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా 11 మంది అమాయకులను బలితీసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది. కాగా మంగళవారం నిందితుడి పూర్తి వివరాలను వెల్లడిస్తామని నాగర్‌కర్నూల్‌ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

ఓ రియల్టర్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి..
పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్‌ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్‌ (10) ఉన్నారని తెలుస్తోంది.

రెండేళ్ల కిందట నాగర్‌కర్నూల్‌ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేశ్‌ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్‌ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్‌ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్‌ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది.

కందనూలులో కలకలం!
'మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను నమ్మిస్తాడు.. మాటలతో పూర్తిగా మభ్యపెట్టి ఆస్తులు రాయించుకుంటాడు.. ఎవరైనా తన దారిలోకి రాలేదని అనుమానం వస్తే మట్టుబెట్టేందుకు సైతం వెనకాడడు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 11 మందిని హతమార్చాడు.. ఇలా మాయమాటలతో మొదలుపెట్టి.. హత్యలతో ముగింపు పలుకుతున్న సదరు మాయగాడి పాపం పండింది.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతుండటంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..' కందనూలులో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా..

మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న మాయగాడు రామెట్టి సత్యనారాయణయాదవ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తన దారికి రానందుకు ఏకంగా 11 మందిని హత్య చేసి పొట్టనబెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం, ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు వదకొండు మంది అమాయకుల హత్యలో సత్యనారాయణకు ప్రమేయం ఉందని, పూర్తిస్థాయి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మాయగాడు సత్యనారాయణయాదవ్ కు సంబంధించి పూర్తి వివరాలను పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించే అవకాశం ఉంది.
► తనకు మంత్రాలు తెలుసంటూ అమాయకులను మచ్చిక చేసుకోవడం, గుప్తనిధులను వెలికితీస్తానంటూ నమ్మిస్తూ సత్యనారాయణయాదవ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన రామస్వామి(50) 2022 నవంబర్ 17న వనపట్ల శివారులో దారుణ హత్యకు గురయ్యాడు.

లింగస్వామి కుమారుడికి బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రతిఫలంగా ఆయనకు ఉన్న 130 గజాల ప్లాటును మార్టిగేజ్ చేయాలని నమ్మించాడని బాధిత కుటుంయిం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లాటును మార్టిగేజ్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న 10 రోజుల వ్యవధిలోనే రామస్వామి హత్యకు గురయ్యాడని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణంలో ఓ వ్యక్తి మరణంతో పాటు వీపనగండ్ల మండలానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసుతోనూ సత్యనారాయణ యాదవ్ కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

► ఇప్పటికే 11 మందిని హత్య చేసినట్లు అనుమానాలు
► హైదరాబాద్‌లో జరిగిన ఓఘటనతో కదులుతున్న డొంక
► పోలీసుల అదుపులో మాయగాడు సత్యనారాయణ
► మూడేళ్ల క్రితం నాగాపూర్‌లో సంచలనం రేపిన నలుగురి మృతి
► ఈ ఘటన వెనుక కూడా ఇతడి హస్తమే ఉన్నట్లు సమాచారం
► గతంలోనే నిందితుడి బాగోతాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

మహిళలపై లైంగిక వేధింపులు..
కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళలను నమ్మిస్తూ వారిపై సత్యనారాయణయాదవ్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటుండగా.. వారి కుటుంబ సమస్యను మంత్రశక్తితో పరిష్కరిస్తానంటూ ఆమెకు చెందిన భూమిని సత్యనారాయణయాదవ్‌ తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. సత్యనారాయణయాదవ్‌ బాగోతాలపై ఏప్రిల్‌ 5న ‘మాయగాళ్లు’ శీర్షికన కథనం ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇటీవల సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పటి వరకు కొనసాగిన హత్యోదంతం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.

సంచలనం రేపిన నాగాపూర్‌ ఘటన!
'జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాకేంద్రంలో తరచుగా చోటుచేసుకుంటున్న ఘటనలపై బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలల తరబడి తిరిగినా ఫలితం ఉండటం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తన మంత్రశక్తితో దూరమైన భార్యాభర్తలను కలుపుతానంటూ మహిళను నమ్మించి రూ.లక్షలు విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ మనోహర్‌ని కలసి ఫిర్యాదు చేసింది.'

► జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న సెటిల్మెంట్ రాయుళ్లదందా
► మంత్రాలు, మాయలతో అమాయకులకు బురిడి
► వరస ఘటనలు చోటుచేసుకుంటున్నా పట్టని పోలీసు అధికారులు
► చోద్యం చూస్తూ నేరస్తులకే సహకరిస్తున్నారన్న ఆరోపణలు

మంత్రాలు, మాయలు అంటూ అడ్డగోలు దందా..
జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ నమ్మబలుకుతూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్న మాయగాళ్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. మాయగాళ్ల చేతుల్లో నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.. జిల్లాలోని వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఆమె భర్తతో కొన్నాళ్లుగా గౌడవలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ తాను మంత్రాలు చేసి భార్యభర్తలను కలుపుతానని నమ్మబలికాడు.

ఇందుకోసం మహిళ పేరిట భూమి, ఆస్తులు ఉంటే పని జరగదని చెప్పి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒప్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ పరిధిలో సదరు మహిళకు ఉన్న రెండు ప్లాట్లను సత్యనారాయణ పేరిట, అతని బందువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విషయం భర్తకు చెప్పిన తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్న భార్యభర్తలు ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణపై ఫిర్యాదుచేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

విచారణ పేరుతో కాలయాపన..
నాగర్ కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన లింగస్వామి (50)కి రామెట్టి సత్యనారాయణ 2013లో 130 గణాల ప్లాటును విక్రయించాడు. తర్వాత లింగస్వామితో పరిచయం పెంచుకున్న సత్యనారాయణ.. లింగస్వామి చిన్న కుమారుడు శివశంకర్‌కు బ్యాంకులో క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే ప్లాటును మార్టిగేజ్ చేయాలని ఒప్పించారు.

2022 నవంబర్ 7న తన బందువు మహేశ్ పేరిట భూమిని మార్టిగేజ్ కాకుండా రిజిస్ట్రేషన్ చేయించాడు. తర్వాత పది రోజులకే 2022 నవంబర్ 17న లింగస్వామి వనపట్ల‌ శివారులో దారుణహత్యకు గురయ్యాడు. లింగస్వామి హత్యకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు నిందితులను పట్టుకోలేదు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

జిల్లాకేంద్రానికి చెందిన మహ్మద్ పాషా శ్రీపురం రోడ్డులో డబ్బాను ఏర్పాటుచేసుకుని చిన్నపిల్లలకు తాయత్తులు కడుతుండేవాడు. తన వద్దకు వచ్చే మహిళ‌కు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెకు సంబందించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశాడు. అతని వేధింపులకు తాళలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నెలలు గడిచినా స్పందన లేదు!
జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణ నాకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, భూమిని మార్టిగేజ్ చేయించాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత పదిరోజులకే మా నాన్న హత్యకు గురయ్యాడు. మాకు వేరే ఎవరితో గొడవలు లేవు. నిందితులను పట్టుకోవాలని ఇప్పటికీ పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను బయటపెట్టాలి. -శివశంకర్,గన్యాగుల

విచారణ చేపట్టాం..
బాధితుల నుంచి అందిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ప్రతి కేసును లోతుగా విచారణ చేపడుతున్నాం. త్వరలోనే విచారణ పూర్తిచేస్తాం.- మోహన్ కుమార్, డీఎస్పీ, నాగర్ కర్నూల్

>
మరిన్ని వార్తలు