జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం

11 Jun, 2020 08:19 IST|Sakshi
బుధవారం కేంద్ర బృందం సభ్యులతో సమావేశమైన జీహెచ్‌ఎంసీ అధికారులు లోకేశ్‌ కుమార్, సంతోష్, కలెక్టర్‌ శ్వేతా మహంతి తదితరులు

కరోనా కేసులు ఇలాగే నమోదవుతుంటే కష్టమే..

హోమ్‌ కంటైన్‌మెంట్, కమ్యూనిటీ సహకారం కీలకం

అప్పుడే కట్టడి సాధ్యం: కేంద్ర సంయుక్త కార్యదర్శి సంజయ్‌

జీహెచ్‌ఎంసీని సందర్శించిన కేంద్ర బృందం..  

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులిచ్చారని, ఇలాగే కరోనా కేసుల సంఖ్య నమోదవుతుంటే జూలై నెలాఖరుకు పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. కోవిడ్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు హోమ్‌ కంటైన్‌మెంట్, కమ్యూనిటీ సహకారం చాలా కీలకమని చెప్పారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు వికాస్‌ గాడే, రవీందర్‌లతో కలసి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్, అదనపు కమిషనర్‌ బి.సంతోష్, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, సీసీపీ దేవేందర్‌రెడ్డి, కోవిడ్‌ కంట్రోల్‌ రూం ఓఎస్డీ అనురాధలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జోన్లు, సర్కిళ్లు, వార్డుల వారీగా నెలకొన్న పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. (మాకు రక్షణ ఏదీ?)

అక్కడ 70 శాతం కేసులు ప్రైవేటులోనే.. 
ఢిల్లీ, ముంబై, చెన్నైలలో ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కూడా కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ప్రైవేటుగా నిర్వహించిన పరీక్షల్లోనే 70 శాతం పైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయని సంజయ్‌ జాజు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గుర్తించిన పాజిటివ్‌ కేసుల సంఖ్య, సంబంధిత కేసుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు అనుసరిస్తున్న పద్ధతి, కోవిడ్‌ లక్షణాలు కనిపించిన వ్యక్తులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న సదుపాయాలు, ఆస్పత్రులు, హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్, కంటైన్‌మెంట్‌ అంశాల గురించి వివరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు హోం కంటైన్‌మెంట్‌ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమన్నారు. ప్రస్తుతం రోజుకు 100 కేసుల కంటే ఎక్కువగా నిర్ధారణ అవుతున్నందున జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డిప్యూటీ కమిషనర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ సమన్వయాన్ని పెంచాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సూచనలు, సహకారాన్ని పొందేందుకు సంబంధిత వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రజారోగ్య సంచాలకులతో పాటు తనను కూడా చేర్చాలన్నారు. కోవిడ్‌ కంట్రోల్‌ రూం నిర్వహిస్తున్న విధుల గురించి వాకబు చేశారు. (ఇళ్లలోనే బోనాలు)

>
మరిన్ని వార్తలు