‘సిట్’కు చుక్కెదురు?

23 Jun, 2015 06:34 IST|Sakshi
‘సిట్’కు చుక్కెదురు?

* విచారణకు హాజరైన టెలికం సర్వీసు ప్రొవైడర్లు
* ఆ వివరాలు ఇచ్చేది లేదన్న కంపెనీల ప్రతినిధులు
* భద్రపరచి ఉంచాలని ఆదేశించిన అధికారులు

 
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు వెలుగులోకి వచ్చిన తరవాత తెలంగాణపై చేస్తున్న కౌంటర్ ఎటాక్‌లో భాగంగా నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న ‘సిట్’కు చుక్కెదురైనట్లు తెలిసింది. వీరిచ్చిన నోటీసుల మేరకు టెలికం సర్వీసు ప్రొవైడర్లు సోమవారం విచారణకు హాజరయ్యారు. అయితే మీరడిగిన ‘ట్యాపింగ్’ సంబంధిత వివరాలను నేరుగా ఇవ్వడం సాధ్యంకాదంటూ ఆయా కంపెనీల ప్రతిని ధులు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనిపై కోర్టును ఆశ్రయించాలంటే ‘పరిధి’ పరమైన ఇబ్బందులొస్తాయని భావించిన అధికారులు ఆ వివరాలను భద్రపరచి ఉంచాల్సిందిగా ఆదేశించి సరిపెట్టారని తెలుస్తోంది.
 
 
 తెలంగాణపై కౌంటర్ ఎటాక్‌లో భాగంగా ఏపీలో నమోదైన 88  కేసుల దర్యాప్తును చేపట్టిన సిట్ ప్రధానంగా ‘ట్యాపింగ్’పై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన ఆధారాలు, పూర్తి వివరాలు సమర్పించాలంటూ శనివారం 12 టెలికం కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో తమ ప్రతినిధులు, నోడల్ ఆఫీసర్లను ఆయా కంపెనీలు సోమవారం విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌కు పంపాయి. సిట్ సభ్యులు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, ఏఎస్పీ దామోదర్ తదితరులు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ‘ట్యాపింగ్’పై విచారణ అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని, దీనికి సంబంధించి ఎలాంటి సమాచారమైనా టెలికం మంత్రిత్వ శాఖ లేదా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియమించిన అధికారి/కమిటీకి మాత్రమే ఇస్తామని విచారణలో పాల్గొన్న ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం.  రహస్యమైనదిగా పరిగణించే ఓ పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలను మరో రాష్ట్ర పోలీసులకు ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారని తెలిసింది.
 
 ఈ పరిణామంతో కంగుతిన్న సిట్ అధికారులు తొలుత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావించి న్యాయ నిపుణుల్ని సంప్రదించారు. ఈ కేసుల దర్యాప్తులో ప్రాథమికంగా పరిధి సమస్య ఉందని, తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లు అనుమానిస్తున్న నేరం/నేరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదైన విషయం నిపుణులు గుర్తుచేశారు. దేశమంతటా ఒకే చట్టం అమలులో ఉన్నప్పటికీ ఒక ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన కేసుల్ని దర్యాప్తు చేసే అధికారం మరో ప్రాంత పోలీసులకు ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ట్యాపింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న నంబర్లకు సంబంధించిన పూర్తి సాంకేతిక సమాచారాన్ని భద్రపరచి ఉంచాలని కంపెనీల ప్రతినిధులకు చెప్పినట్లు తెలిసింది.
 
 వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న సీఐడీ
 మత్తయ్య ఫిర్యాదు మేరకు విజయవాడ సత్యనారాయణపురంలో నమోదైన కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మత్తయ్య విజయవాడ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో తన ఫోను సైతం ట్యాపింగ్‌కు గురైనట్లు పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై సీఐడీ అధికారులు దృష్టి పెట్టారు. నేరుగా అడిగితే సర్వీసు ప్రొవైడర్ల నుంచి ‘ట్యాపింగ్’కు సంబంధించిన వివరాలు వచ్చే అవకాశం తక్కువని భావించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో పరిధి సమస్య లేకపోవడంతో ఆయా వివరాలు తమకు ఇచ్చేలా కంపెనీలను ఆదేశించాలని కోరుతూ సోమవారం విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేశారు. మరోపక్క ఏపీ డీజీపీ జేవీ రాముడు సోమవారం ‘సిట్’, సీఐడీ చీఫ్‌లతో తన కార్యాలయంలో భేటీ అయ్యారు. కేసుల దర్యాప్తు తీరుతెన్నుల్ని సమీక్షించారు.
 

మరిన్ని వార్తలు