ఎట్టకేలకు .. ఎలాన్‌ మస్క్‌ నిరీక్షణ ఫలించింది?

8 Nov, 2023 21:30 IST|Sakshi

శాటిలైట్‌ ఆధారిత వాయిస్‌, డేటా కమ్యూనికేషన్‌ వంటి ఇంటర్నెట్‌ సేవలు భారత్‌లో అందించాలన్న స్టార్‌ లింక్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ నిరీక్షణ ఫలించింది. డేటా స్టోరేజీ, ట్రాన్స్‌ఫర్‌ వంటి అంశాల్లో స్టార్‌ లింక్‌ ఇచ్చిన సమాధానంతో కేంద్రం సంతృప్తి చెందింది. త్వరలో స్టార్‌లింక్‌ సేవలందించేలా అనుమతి ఇవ్వనుందని సమాచారం.   

గతంలో స్టార్‌లింక్‌ సేవల్ని అందించాలని భావించిన మస్క్‌ కేంద్ర అనుమతి కోరారు. ఆ సమయంలో తమ సంస్థ డేటా బదిలీ, స్టోరేజీ పరంగా అంతర్జాతీయంగా ఉన్న చట్టాలను అనుసరిస్తామని చెప్పారు. అయితే దీనిని భారత్‌ వ్యతిరేకించింది. ​డేటా స్టోరేజీ విషయంలో భారత నియమ నిబంధనలే పాటించాలని ప్రభుత్వం స్టార్‌ లింక్‌కు స్పష్టంచేసింది.

దీంతో చేసేది స్టార్‌ లింక్‌ సేవల కోసం మరోసారి ధరఖాస్తు చేసుకుంది. తాజాగా, స్టార్‌ లింక్‌ ఇచ్చిన సమాధానం పట్ల ప్రభుత్వం సంతృప్తి వ్యక్తంచేసింది. భద్రతతో పాటు పలు అంశాలను పరిశీలించిన తర్వాతే గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ (జిఎమ్‌పీసీఎస్) లైసెన్స్‌ ఇవ్వనుందని కేంద్ర అధికారులు తెలిపారు.

జియో, ఎయిర్‌టెల్‌కి పోటీగా
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌కి చెందిన వన్‌వెబ్‌ ఇప్పటికే దేశంలో జీఎంపీపీసీఎస్‌ లైసెన్స్‌ను పొందాయి. స్టార్‌ లింక్ ఆమోదం పొందితే.. ఈ లైసెన్స్‌ని పొందిన మూడవ శాటిలైట్ కమ్యూనికేషన్స్ (శాట్‌కామ్) కంపెనీగా అవతరించనుంది. స్టార్‌లింక్‌కు జీఎంపీడీఎస్‌ లైసెన్స్‌పై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం షెడ్యూల్ జరిగినట్లు సమాచారం. 

త్వరలో అందుబాటులోకి
లైసెన్స్ కోసం ప్రభుత్వ అనుమతితో పాటు, శాట్‌కామ్ ప్లేయర్‌లు స్పేస్ రెగ్యులేటర్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) నుండి కూడా అనుమతి పొందవలసి ఉంటుంది. ఈ అనుమతులు లభిస్తే వెంటనే భారత్‌లో స్టార్‌ లింక్‌ అందుబాటులోకి వస్తాయి.

మరిన్ని వార్తలు